Site icon NTV Telugu

Robbery: దొరికినంత దోచుకొని.. చివర్లో ‘ప్రేమ’లేఖతో ట్విస్ట్!

Robbers I Love You Text On Tv

Robbers I Love You Text On Tv

ఈమధ్య దొంగలు కాస్త సినిమాటిక్‌గా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. బహుశా ఆ సినిమాల్నే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలీదు కానీ.. వెళ్ళిన ప్రతి చోటా, ఏదో కామెడీ పనికి పాల్పడుతున్నారు. ఇందుకు తాజా ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది. ఇంట్లో ఉన్న సామాన్లతో ఉడాయించిన దొంగలు.. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. టీవీపై ‘ఐ లవ్ యు’ అని రాశారు. ఈ ఘటన గోవాలోని మార్గోవ్‌లో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆసిబ్ జెక్ అనే వ్యక్తి రెండు రోజులు హాలిడే కోసం వెళ్ళాడు. మంగళవారం తిరిగి ఇంటికొచ్చాడు. గడప దగ్గర కాస్త తేడాగా అనిపించింది. అయినా పట్టించుకోకుండా తాళాలు తీసి లోపలికి వెళ్ళాడు. అంతే, లోపల కాలు పెట్టడమే ఆలస్యం, దిమ్మ తిరిగిపోయే దృశ్యాలు కనిపించాయి. టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్ యూ’ అని మార్కర్‌తో రాసి ఉండటాన్ని అతను గమనించాడు. దీంతో, ఇంట్లో దోపిడీ జరిగిందని గ్రహించి, అసలు ఏం దొంగలించబడ్డాయోనని ఇళ్లంతా వెతికాడు. రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 1.5 లక్షల నగదు చోరీ అయినట్టు గుర్తించాడు.

ఆసిబ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, తన ఇళ్లు దోపిడీకి గురైనట్టు తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసిబ్ సరిగ్గా హాలిడేకి వెళ్ళాకే ఈ దోపిడీ జరగడాన్ని బట్టి చూస్తుంటే, ఎవరో చాలా రోజుల నుంచే ఆ ఇంటిపై నిఘా వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరో దగ్గరి వ్యక్తులే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

Exit mobile version