Telugu Actress Harassed By Fitness Trainer In Mumbai: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సెలెబ్రిటీలు సైతం ఈ కామాంధుల చేతుల్లో బలి అయిపోతున్నారు. తాజాగా ఓ తెలుగు నటిపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఓ తెలుగు నటికి ముంబైలోని కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య కపూర్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది. అతను మొదట్లో ఆమె పట్ల మంచిగానే ప్రవర్తించాడు. కానీ, ఆ తర్వాత అతడు తనలోని రాక్షస రూపాన్ని బయటపెట్టాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనుకున్న ఆదిత్య.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. అదిగో, ఇదిగో అంటూ మాట దావేస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెళ్లి ఊసెత్తడమే మానేశాడు. దీంతో ఆదిత్యను ఆ నటి నిలదీయడంతో.. ఆమెను దూషించడంతో పాటు చెయ్యి చేసుకున్నాడు. విచక్షణారహితంగా కొట్టాడు. అంతేకాదు.. తామిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను బయటపెడతానంటూ బెదిరించాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే, చంపేస్తానని కూడా హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన సదరు తెలుగు నటి.. పోలీసులకు ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఆదిత్య కపూర్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. సదరు తెలుగు నటి 2016 నుంచి కొన్ని చిత్రాల్లో నటించినట్టు తెలిసింది.
