Tammineni Krishnaiah Wife Mangathayamma Blaming CPM Venkateswara Rao: తన భర్త తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే కారణమని భార్య మంగతాయమ్య ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న తమ కుటుంబాన్ని చూసి ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. సీపీఎం నాయకుల హత్య రాజకీయాలు, అక్రమాలను చూసే తాము పార్టీ నుంచి బయటకొచ్చామని తెలిపారు. హత్యలు చేస్తే బెదిరిపోయే రోజులు పోయాయని, ఇలాంటి ఘటనల వల్ల తమ కుటుంబం భయపడదని చెప్పారు. తాము ప్రజల కోసం పని చేశామని, ప్రజలు తమ వెంటే ఉంటారని వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన మంగతాయమ్మ.. నిందితుల్ని శిక్షించేవరకూ పోరాడుతామని అన్నారు.
అయితే.. కృష్ణయ్య హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం నేతలు చెప్తున్నారు. హత్యా రాజకీయాల్ని తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సాహించదని, సీపీఎం నేతల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని అన్నారు. మరోవైపు.. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ జరుపుతోంది. నిందితుల కోసం నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసింది. హత్యకు బాధ్యులు ఎవరైనా సరే.. వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? లేక కుటుంబ కలహాలే కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోందని అన్నారు. కృష్ణయ్యను హత్య చేసి, పారిపోయిన నిందితుల్ని కచ్ఛితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ యంత్రాంగం తెలిపింది.
కాగా.. ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో రైతు వేదిక వద్ద జెండా ఎగరేసిన తర్వాత కృష్ణయ్య తన డ్రైవర్ ముతేష్‌తో కలిసి బైక్‌పై బయలుదేరారు. అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న దుండగులు.. ఆయన బయలుదేరిన సమాచారం అందుకొని వెంబడించారు. ఒక చోట అడ్డగించి, డ్రైవర్‌ని బెదిరించి, అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం.. కృష్ణయ్యపై కత్తితో ఏకధాటిగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్య ఒంటిపై 12 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం ఐదుగురు దుండగులు ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది.
