Site icon NTV Telugu

Tragedy In Love Marriage: ప్రేమ వివాహంలో విషాదం.. ఉదయం పెళ్లి, సాయంత్రం మృతి

Love Marriage Tragedy

Love Marriage Tragedy

Software Engineer Found Dead in Mysterious Circumstances After Marriage: ప్రేమ వివాహంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి అవ్వగా, సాయంత్రమే అనుమానాస్పద స్థితిలో పెళ్లకొడుకు చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తాంబరానికి చెందిన సురేష్‌ కుమార్‌ (30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే.. అతడు, గోమతి (30) అనే యువతి ప్రేమించుకున్నారు. గోమతి ప్రస్తుతం కోటకుప్పంలో మున్సిపల్ ఉద్యోగినిగా పని చేస్తోంది. కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నప్పటికీ.. సరైన సమయం వచ్చాక పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకుందామని వాళ్లు నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం సురేష్ కుమార్, గోమతి వృత్తిరీత్యా సెటిల్ అవ్వడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపట్టు ప్రాంతంలో బాలమురుగన్‌ ఆలయంలో వారి వివాహం జరిగింది. అదే రోజు సాయంత్రం సాయంత్రం కోటకుప్పంలోని ఓ ప్రైవేట్‌ హాలులో వీరి రిసెప్షన్‌ ప్లాన్ చేశారు. అయితే.. ఈ రిసెప్షన్ జరగడానికి ముందు వరుడు కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్టల్‌లో బస చేశారు. ఈ క్రమంలోనే సురేష్ కుమార్ దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పి, తన గదిలోకి వెళ్లాడు. అలా వెళ్లిన సురేష్.. చాలాసేపు వరకు బయటికి రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో సురేష్‌ కుమార్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

తల్లిదండ్రులు వెంటనే తమ బంధువుల్ని పిలిపించి, సురేష్ కుమార్‌ను పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే.. సురేష్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి.. సురేష్‌ కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆసుపత్రికి తరలించారు. ఇతని చనిపోవడానికి గల కారణాలేంటో తెలియకపోవడంతో.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version