Site icon NTV Telugu

Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..

Sbi

Sbi

ఎస్‌బీఐ (SBI) బ్యాంకులో పనిచేసే ఒక మేనేజర్ , మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతాదారుల సొమ్మును కాజేసిన వైనం నల్గొండ జిల్లాలో బయటపడింది. సుమారు 2.65 కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎవరు ఈ నిందితులు..?
ఈ దోపిడీలో నలుగురు ప్రధాన నిందితులు ఉన్నారు. వారిలో ఎస్‌బీఐ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ పి. వెంకట రమంజనేయులు, దేవరకొండ బ్యాంకులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పనిచేసే చక్రపాణి, రికవరీ ఏజెంట్ రామ్‌లాల్, ఫోటోగ్రాఫర్ శివ ఉన్నారు.

దోపిడీ ఎలా జరిగింది?
చాలా కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఉన్న బ్యాంకు ఖాతాలను వీరు టార్గెట్ చేశారు. బ్యాంకు మేనేజర్ తనకున్న అధికారంతో బ్యాంకు సిస్టమ్ ద్వారా ఎక్కువ డబ్బు ఉన్న 10 ఖాతాల వివరాలను సేకరించాడు. ఆ తర్వాత ఆ ఖాతాదారుల పేర్లతో నకిలీ ఆధార్ కార్డ్‌లు , పాన్ కార్డ్‌లను సృష్టించారు.

ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి, బ్యాంకు రికార్డుల్లో ఖాతాదారుల ఫోన్ నంబర్లను మార్చేశారు. కొత్త నంబర్లతో కేవైసీ (KYC) అప్డేట్ చేసి, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను పొందారు. ఆపై ఖాతాల్లో ఉన్న డబ్బును తమకు తెలిసిన వారి అకౌంట్లలోకి మళ్లించారు.

మోసం బయటపడింది ఇలా..
హైదరాబాద్‌కు చెందిన పి. నరేంద్ర అనే వ్యక్తి ఖాతాలో వీరు అనధికారికంగా కేవైసీ మార్పులు చేసినప్పుడు, అతనికి ఒక అలర్ట్ ఈమెయిల్ వచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన నరేంద్ర వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అంతర్గత విచారణ జరిపి మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 2.42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి దగ్గర ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. కాజేసిన సొమ్ములో మేనేజర్ , చక్రపాణికి చెరో 40 శాతం, మిగిలిన ఇద్దరికీ 10 శాతం చొప్పున వాటాలు పంచుకున్నట్లు తేలింది.

Exit mobile version