Site icon NTV Telugu

Chandrashekhar Guruji: హుబ్లీలో కలకలం.. చంద్రశేఖర్‌ గురూజీ దారుణ హత్య

Chandrashekhar Guruji

Chandrashekhar Guruji

కర్ణాటకలోని హుబ్లీలో ప్రముఖ వాస్తు నిపుణులు చంద్రశేఖర్ గురూజీ హత్య కలకలం రేపుతోంది.. సరళ వాస్తు ఫేమ్ డాక్టర్ చంద్రశేఖర్ గురూజీ ఇవాళ ఉదయం హుబ్లీలోని ఓ హోటల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు.. ఇద్దరు వ్యక్తులు గురూజీని కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తోంది.. హత్య అనంతరం ఇద్దరు నిందితులు హోటల్‌ నుంచి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. ఇద్దరు దుండగులు భక్తులుగా చెప్పుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లారని.. వారిలో ఒకరు చంద్రశేఖర్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేసినట్టు చెబుతున్నారు.

Read Also: Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల

ఈ హత్యకు సంబంధించిన ప్రాథమిక నివేదికల ప్రకారం, ఇద్దరు నిందితులు చంద్రశేఖర్ గురూజీకి గత రెండేళ్లుగా తెలుసని పోలీసులు చెబుతున్నారు.. తమ వ్యాపారంలో పురోగతికి సంబంధించి చంద్రశేఖర్‌తో సంప్రదించేందుకు నిందితులు రూ.2 లక్షలు గురూజీకి చెల్లించినట్లు సమాచారం ఉండగా… అయినా, వారి వ్యాపారంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో చంద్రశేఖర్‌పై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇక, నిందితుడు రెండు రోజుల క్రితం డాక్టర్ చంద్రశేఖర్ గురూజీ కార్యాలయానికి వెళ్లి వివరాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. హోటల్‌ దగ్గర చంద్రశేఖర్ కోసం దాదాపు 30 నిమిషాల పాటు నిరీక్షించిన దుండగులు.. ఆయన కిందకు వచ్చిన తర్వాత దాడి చేశారు.

ఇక, ఈ ఘటనపై హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ లాభూరామ్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపారు.. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. ఏసీపీ ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. కాగా, డాక్టర్ చంద్రశేఖర్ గురూజీ స్వస్థలం బాగల్‌కోట్. బాగల్‌కోట్‌లోని బసవేశ్వర ఇంజినీర్ కళాశాలలో సివిల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. 1988లో తన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత, ముంబైలో ఆరేళ్లపాటు కాంట్రాక్టర్‌గా పనిచేశారు.. ఆ తర్వాత వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సింగపూర్‌ వెళ్లారు.. తిరిగి ముంబై వచ్చిన తర్వాత నగరంలో తన మొదటి వాస్తు శాస్త్ర కార్యాలయాన్ని ప్రారంభించారు… క్రమంగా అతని సేవలకు డిమాండ్ పెరగడంతో.. బెంగళూరు, హుబ్లీ మరియు కర్ణాటకలోని అనేక ఇతర నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించారని తెలుస్తోంది. ఇక, ఆయన మొదటి భార్య నుండి ఒక కుమార్తె సంతానంగా ఉండగా.. మొదటి భార్య మరణించిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ మళ్లీ వివాహం చేసుకున్నారు.. రెండో భార్యకు పిల్లలు లేరు. అతనికి ఒక కుమార్తె, ఇద్దరు సోదరులు మరియు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

Exit mobile version