US Crime: అమెరికా మిషిగాన్ రాష్ట్రంలో జరిగిన నిండు గర్బిణి రెబెక్కా పార్క్ హత్య సంచలంగా మారింది. ఈ హత్య విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 ఏళ్ల రెబెక్కా హత్యలో నిందితురాలు ఆమె తల్లి కోర్ట్నీ బార్గోలోమ్యూ, ఆమె భర్త బ్రాడ్లీ బార్తోలోమ్యూ నిందితులుగా ఉన్నారు. రెబెక్కా 2025 నవంబర్‌లో అదృశ్యమైంది. 39 వారాల గర్భిణిగా ఉన్న రెబెక్కా మానిస్టీ నేషనల్ ఫారెస్ట్‌లో శవంగా లభించింది. ఆమెకు పుట్టబోయే శిశువు మృతదేహం ఇంకా దొరకలేదు.
రెబెక్కాకు కాబోయే భర్త, బిడ్డకు తండ్రైన రిచర్డ్ ఫాలోర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. కోర్ట్నీతో తనకు 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు లైంగిక సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సంబంధం ముగిసిన తర్వాత 2023 సెప్టెంబర్‌లో రెబెక్కాతో డేటింగ్ ప్రారంభించినట్లు వాంగ్మూలం ఇచ్చారు. తనతో ఉన్న సమయంలో కోర్ట్నీ కూడా మరో బిడ్డ కావాలని కోరుకున్నట్లు ఫాలోర్ చెప్పారు.
రెబెక్కా హత్య ముందు ఏం జరిగింది.?
రెబెక్కా అదృశ్యమయ్యే ముందు రాత్రి ప్రసవ వేదనలు మొదలయ్యాయని, ఓ స్నేహితుడి కారులో ఆస్పత్రికి వెళ్తుండగా, కోర్ట్నీ వాహనాన్ని ఆపి, తానే రెబెక్కాను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పిందని ఫాలోర్ కోర్టులో చెప్పారు. ఆస్పత్రి నుంచి ప్రసవం కాకుండానే రెబెక్కాను ఇంటికి పంపించారు. ఆ తర్వాత తన తల్లితో ఇంటికి తిరిగి వెళ్లిందని, కానీ ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. ఇదే కాకుండా, కోర్ట్నీ సుమారు 18000 డాలర్ల చెక్కు ఫోటో చూపించి, అది తన అమ్మమ్మ వారసత్వంగా వచ్చిన డబ్బులో భాగమని చెప్పి, రెబెక్కాను తన ఇంటికి రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్3 అర్ధరాత్రికి ముందు రెబెక్కాను తల్లి ఇంట్లో చివరిసారిగా చూశారు.
కోర్ట్నీ, బ్రాడ్లీలు కలిసి రెబెక్కాను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్ట్నీకి మరో బిడ్డ కావాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు అధికారులు ఆరోపించారు. ఈ కేసులో కోర్ట్నీ, బ్రాడ్లీలపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, ఫెలోనీ మర్డర్, టార్చర్ వంటి కేసులు ఉన్నాయి. అయితే నిందితులు ఇప్పటి వరకు నేరాన్ని అంగీకరించలేదు.

