Matrimonial fraud: ఇండియాలో మాట్రీమోనీ సైట్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో గొప్పింటి సంబంధాలని బొక్కబోర్లా పడుతున్నారు. చాలా కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెబుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మచ్చిక చేసుకుని వారి వద్ద నుంచి డబ్బుతో ఉడాయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శారీరక దోపిడీకి కూడా పాల్పడుతున్నారు.
తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. మహిళల్ని పెళ్లి చేసుకుని వారిని ఆర్థికంగా దోపిడికి గురిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాకకు చెందిన బిరంచి నారాయణ్ నాథ్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలు..
వేర్వేరు ప్రొఫైళ్ల ద్వారా తనను తాను రైల్వే ఉద్యోగిగా, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా, కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తునట్లు మాయ మాటలు చెప్పి మహిళల్ని మోసగిస్తున్నాడు. పెళ్లికాని, విడాకులు తీసుకున్న లేదా వితంతులైన మధ్య వయస్కులైన మహిళల్ని అతడు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వైబ్‌సైట్‌లో పరిచయం పెంచుకుని, ఫోన్‌లో సుదీర్ఘ సంభాషణలు చేసి, ఆపై బాధిత మహిళల ఇంటికి వెళ్లేవాడు. నిందితుడు వారి పిల్లలకు జీవితాంతం సాయపడుతానని వాగ్దానం చేసి, వారిని మానసికంగా లొంగదీసుకునే వాడు. అతను బాధిత మహిళల్లో చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి పెళ్లి తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. గుడిలో పెళ్లి చేసుకుని, వారి ఇంట్లోనే ఉండేవాడు. వారిని తన సొంత ప్రాంతానికి తీసుకెళ్లేవాడు కాదు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించే వాడు.
ఇతడిపై రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో పాటు ఒడిశాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కటక్‌కి చెందిన ఓ మహిళా ఒడిశా సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ యూనిట్‌లో కేసు నమోదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. సదరు మహిళ 2022లో రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయింది. ఇద్దరు కుమార్తెలు ఉననారు. గతేడాది అక్టోబర్‌లో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. సుమారు రూ. 5 లక్షల నగదు, 32 గ్రాముల బంగారాన్ని దోచుకున్నాడు. ఆమె చివరకు అతని ఇతర సంబంధాలను కూడా కనుగొంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.