Pappachan murder: కేరళలో పాపచ్చన్ అనే 82 ఏళ్ల వృద్ధుడి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. దురాశ, నమ్మక ద్రోహంతో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళా ఈ క్రూరమైన ప్లాన్‌కి స్కెచ్ వేసింది. ముందుగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన గ్యాంగ్, సీసీకెమెరాలను పరిశీలించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
‘‘తనకంటూ ఎవరూ లేరు’’ అని పాపచ్చన్ చెప్పిన ఒక్క మాటే ఆయన హత్యకు కారణమైంది. పదవీ విరమణ బెనిఫిట్స్‌తో పాటు దాదాపుగా ఆయన బ్యాంక్ ఖాతాలో రూ. 80 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కన్నేసిన ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, ఈ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ చేసి అతడిని చంపేసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పాపచ్చన్ కుమార్తె దాఖలు చేసిన ఫిర్యాదు ఈ కేసులో కీలకంగా మారింది.
Read Also: Bangladesh: హిందూ నేతలని కలిసిన బంగ్లా తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్..
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన పాపచ్చన్ తన డిపాజిట్లపై వడ్డీ రాలేదనే ఫిర్యాదుతో కొల్లాంలోని తేవల్లిలోని ఓలైన్‌లో ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. అతని ఫిర్యాదుతో మేనేజర్ సరిత, సహోద్యోగి అనూప్‌లు ఈ దుష్ట పన్నాగానికి ప్లాన్ చేశారు. పాపచ్చన్ చనిపోతే ఈ డబ్బును ఎవరూ క్లెయిమ్ చేయరని తెలిసి హత్యకు పథకం రచించారు. తన కుటుంబానికి దూరమైన పాపచ్చన్ ఒంటరిగా జీవిస్తున్నాడని నిందితులకు ముందే తెలుసు. సరిత, అనూప్ పాపచ్చన్‌తో సన్నిహితంగా ఉండేవారని తెలసింది. అతని రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్‌ని తమ బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఒప్పించారు. అంతకుముందు పాపచ్చన్ డబ్బు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్‌గా ఉండేది.
పాపచ్చన్‌ని చంపేందుకు అనియోల్ అనే వ్యక్తిని సరిత సంప్రదించింది. వీరిద్దరూ ఐదేళ్ల క్రితం ఒక కంపెనీలో ఉద్యోగులు. తమ ప్లాన్ కోసం ఆటోరిక్షా డ్రైవర్ మహీన్‌ని కుట్రలో చేర్చుకున్నారు. అనిమోల్ అతని గ్యాంగ్ మే 20న అతడిని చంపేందుకు సిద్ధమయ్యారు. అయితే, వర్షాలు కురుస్తుండటంతో పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి మే 23న మధ్యాహ్నం సరిత టీ తాగుదామని పాపచ్చన్‌ని బయటకు తీసుకువచ్చింది. సైకిల్‌పై వస్తున్న పాపచ్చని కారుతో ఢీకొట్టి, అతడిపై నుంచి ఎక్కించి చంపేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు.