Tanuja Ranjan Murder Case: టూరిస్ట్‌ల ముసుగులో పక్కదేశంలోకి చొరబడి.. మారువేషాల్లో శత్రువుల స్థావరాల్లోకి వెళ్తారు ! కూలీలుగా పనిచేస్తూ, హోటళ్లలో పనికి చేరి.. నెలల తరబడి నిఘాపెట్టి.. శత్రువులను ట్రాప్‌చేసి పట్టుకుంటారు. ఇదేదో దురంధర్ సినిమా స్టోరీలా ఉందనుకుంటున్నారా! సినిమా స్టోరీని తలపించేలా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ నేపాల్ నిర్వహించారు. సినిమా థ్రిల్లర్‌ను తలపించేలా.. ఈ ఆపరేషన్‌లో ట్విస్ట్‌లు ఏంటి..? నేపాల్ నుంచి నాంపల్లి వరకు నిందితులను ఎలా వేటాడారు..? లెట్స్ వాచ్….
హైదరాబాద్ పోలీసులంటే ఏంటో మరోసారి సత్తాచాటి చూపారు! దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న గ్యాంగ్ ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. నేరానికి పాల్పడింది నేపాల్ గ్యాంగ్ అని తెలియగానే.. ఇక దొరకరు లే అనుకునే రోజులు పోయాయ్!! నేపాల్‌కి వెళ్లడమే అసాధ్యం అనుకునే పరిస్థితుల నుంచి నేపాల్‌లో మాటువేసి పక్కా ట్రాప్‌తో నేరగాళ్ల చొక్కాపట్టుకుని లాక్కొచ్చారు హైదరాబాద్ పోలీసులు.
జూబ్లీహిల్స్‌లో జరిగిన రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. ఆపరేషన్ నేపాల్ చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు ఈ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. కొన్ని నెలలపాటు పలు రాష్ట్రాల్లో మాకాం వేసి నిందితులను వెంటాడారు. ఈ ఏడాది మే నెలలో రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్‌ను హత్య చేసి ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో పారిపోయారు దోపిడీ దొంగలు. దోపిడీకి పాల్పడింది నేపాల్ గ్యాంగ్‌గా గుర్తించారు పోలీసులు. తనూజ రంజన్ ఇంట్లో పనిమనిషిగా చేరిన కల్పన.. నమ్మకంగా నటిస్తూ రెక్కీ చేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటారు.. ఎప్పుడెప్పుడు ఉంటారు.. డబ్బులు, నగలు ఎక్కడ దాచిపెడతారు.. ప్రతీది అబ్జర్వ్ చేసింది. ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం పూణె నుంచి ఒక గ్యాంగ్, నేపాల్ నుంచి మరో గ్యాంగ్ జూబ్లీహిల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వినయ్ రంజన్ ఇంట్లో లేని సమయం చూసుకుని.. కల్పన సహాయంతో దోపిడీకి పాల్పడ్డారు నేపాల్ గ్యాంగ్. తనూజ రంజన్ నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరాడక చనిపోయారు.
226 గ్రాముల బంగారం, నగదుతో ముందుగా కాజీపేట చేరుకున్నారు. అక్కడ తమ వాటాలు పంచుకుని, ఎవరికి వారుగా డివైడ్ అయి.. నేపాల్ వెళ్లిపోయారు. నేపాల్ చేరుకున్నారంటే.. ఆ గ్యాంగ్‌లను పట్టుకోవడం అంత సులభం కాదు. అక్కడ నిందితులను గుర్తించాలి… వారి కదలికలపై నిఘా పెట్టాలి.. సరైన సమయం చూసి అదుపులోకి తీసుకోవాలి.. ఆ దేశ పోలీసులకు సమాచారం ఇవ్వాలి… అంతా పెద్ద ప్రాసెస్. నిందితుల కోసం సాధారణ దర్యాప్తుతో సరిపెట్టుకోలేదు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీసులతోపాటు.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ముందుగా ఢిల్లీ చేరుకుంది. అక్కడి నుంచి లక్నో… ముంబై.. పూణె.. బెంగుళూరు.. ఉత్తరాఖండ్.. నేపాల్ వరకు తిరుగుతూ పలుప్రాంతాల్లో నిఘా పెట్టారు. పర్యాటకుల ముసుగులో ఇతర రాష్ట్రాల్లో చొరబడి… కొందరు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వర్కర్లుగా, కొందరు కూలీలుగా.. కొందరు తామెవరో ఎక్కడుంటున్నారో కూడా తెలియకుండా.. సీక్రెట్ మిషన్ చేపట్టారు. నేపాల్ కి వెళ్లిన పోలీసులకు అసలైన సవాల్ ఎదురైంది. నిందితులు ఎక్కడుంటున్నారు..? ఎవరితో ఉంటున్నారు..? ఎప్పుడు బయటకు వస్తున్నారు..? వారి నెక్స్ట్ మూవ్ ఏంటి..? ఇలా ప్రతీది క్షుణ్ణంగా నిఘా పెట్టారు. స్థానికుల్లో కలిసిపోయిన టీమ్.. నిందితుల నెట్వర్క్‌ను ట్రాప్ చేశారు. 5 నెలలుగా నేరస్తులను ట్రాప్ చేస్తున్న పోలీసులు… కీలక సమాచారం రాబట్టారు. నేరం చేసి నేపాల్ వెళ్లిన గ్యాంగ్ తిరిగి భారత్‌లోకి అడుగుపెడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగుళూరు దోపిడీలకు స్కెచ్ వేసి, తమ గ్యాంగ్‌తో నేరుగా హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌కు ఎంట్రీ ఇచ్చారు. వారినే అనుసరిస్తూ వచ్చిన పోలీసులు.. ఈ గ్యాంగ్ ఆటకట్టించారు.
నేపాల్‌కి చెందిన తిరువా అలియాస్ కల్పన గతేడాది జూన్‌లో బంధువు జోగి ద్వారా.. హైదరాబాద్ కి వచ్చి తనూజ రంజన్ ఇంట్లో పనికి చేరినట్లు గుర్తించామన్నారు సీపీ సజ్జనార్. పూణెలో నివసించే నేపాల్ జాతీయుడు బికాస్‌తో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించిందని.. ఇక్కడ నిర్వహిస్తున్న రెక్కీ వివరాలను కల్పన ఎప్పటికప్పుడు చేరవేసేదని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకు 2026లో పూణె వెళ్లిన కల్పన.. తన రెక్కీ వివరాలను మొత్తం బికాస్‌తో డిస్కస్ చేసింది. మే 4న బెంగుళూరు వెళ్లిన బినయ్.. అక్కడే ఉంటున్న గణేశ్ షాహి, శంకర్ లామా, సునీల్ పరివార్‌తో కలిసి తనూజ రంజన్ ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు సీపీ.
అద్దెకు తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారులో బెంగుళూరు నుంచి ఈ గ్యాంగ్ పూణె చేరుకుంది. సురేష్ షాహి, నేత్ర షాహి కూడా ఈ గ్యాంగ్‌లో చేరారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ముఠా జూబ్లీహిల్స్‌లో దోపిడీకి పాల్పడింది. ఈ ముఠాకి చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. ఈ ఇద్దరితో పాటు గతంలో నేరాలకు పాల్పడిన నేపాల్ గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగుతుందని తెలిపారు సీపీ. సినిమాల్లో హీరోలు చేసే స్పై ఆపరేషన్లు తలపించేలా.. నేపాల్ లో మొదలై, నాంపల్లిలో ముగిసిన ఈ ఆపరేషన్ ఎన్నో సస్పెన్స్‌లు, థ్రిల్లర్లతో సాగింది. ఖాకీల చేతిలో లాఠీలు, తుపాకీలు మాత్రమే కాదు… అవసరమొచ్చినప్పుడు శత్రువుల మధ్య కలిసిపోయి, వాళ్ల భరతం పట్టే వ్యూహాలు కూడా ఉంటాయని ఈ ఆపరేషన్ నిరూపించింది.

