Site icon NTV Telugu

Operation Gone Wrong: డాక్టర్ నిర్వాకం.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసి..

Operation Gone Wrong

Operation Gone Wrong

Operation Gone Wrong In Kurnool Patient Died: కొందరు డాక్టర్లు ఏం లేకపోయినప్పటికీ.. పేషెంట్లకు ఏవేవో జబ్బులు ఉన్నాయని చెప్పి, డబ్బులు గుంజుతుంటారు. సమస్య చిన్నదే అయినా.. దాన్ని పెద్దదిగా చూపించి, ఆపరేషన్ చేయాలని చెప్పి, లక్షలకు లక్షలు దోచుకుంటుంటారు. ఓ డాక్టర్ కూడా అలాగే ఒక వ్యక్తి నుంచి డబ్బులు దోచుకోవాలని చూశాడు. కానీ, అతని ప్లాన్ బెడిసికొట్టింది. ఆపరేషన్ వికటించి, బాధితుడు చనిపోవడంతో.. సదరు డాక్టర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్(28), కొంతకాలం నుంచి కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నాడు. ఈమధ్య సమస్య తీవ్రం కావడంతో.. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించాడు. ఆ ఆర్ఎంపీ కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్‌ను రిఫర్ చేశాడు.

ఆ ఆర్ఎంపీ సూచన మేరకు.. సుమంత్ వెంటనే మెడికేర్ ఆసుపత్రికి వెళ్లి, తన సమస్య చెప్పుకున్నాడు. అతడ్ని పరీక్షించిన వైద్యుడు.. స్కానింగ్ తీయించాలని సూచించాడు. స్కానింగ్ రిపోర్ట్ పరిశీలించిన అనంతరం.. నీకు అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయని హెచ్చరించాడు. దాంతో సుమంత్ సదరు ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ఆసుపత్రిలో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ ముగిశాక, ఇక ఎలాంటి సమస్య లేదని ఆ వైద్యుడు చెప్పాడు. అయితే.. అదే రోజు రాత్రి అతనికి తీవ్రమైన కడుపునొప్పి, ఆయాసం వచ్చాయి. అప్పుడు వెంటనే వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లారు. అయినప్పటికీ ఆ సమస్య తగ్గకపోవడంతో, మరింత పెరిగింది. దీంతో అతడు గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడంటూ సుమంత్ భార్య ఆరోపించింది. కుటుంబ సభ్యులు సుమంత్ మృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచి, ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాల సమస్యని పరిష్కరించి, రాజీ కుదిర్చారు.

ఈ విషయంలో వెలుగుచూసిన షాకింగ్ విషయం ఏమిటంటే.. సుమంత్‌కు చికిత్స అందించిన ఆ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. తాత్కాలిక అనుమతులు కూడా లేవని తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య చెప్పారు. చూస్తుంటే.. డబ్బులకు ఆశ పడి, ఏం లేకపోయినా డబ్బుల కోసం సుమంత్‌కి అపెండిక్స్ ఉందని అబద్ధం చెప్పి, ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version