One Person Died In Warangal Ursu Gutta Fight Between Two Groups: అప్పటివరకూ అక్కడి వాతావరణం ప్రశాంతంగానే ఉంది. కానీ.. ఒక్కసారిగా నెలకొన్న ఘర్షణతో ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. వాగ్వాదం నుంచి మొదలైన ఆ ఘర్షణతో.. కత్తులతో దాడి చేసుకునేదాకా వెళ్లింది. ఈ క్రమంలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌లోని ఉర్సు గట్ట వద్ద రెండు వర్గాల మధ్య ఓ విషయమై ఘర్షణ నెలకొంది. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ ఆ వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో.. కొందరు కత్తులతో దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ దాడుల్లో ఎస్ఆర్ఆర్ తోటకి చెందిన రాకేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి తీవ్ర గాయాలవ్వడం, అధిక రక్తస్రావం కావడం వల్ల.. చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణకు గల కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.
