New Year Violence: న్యూ ఇయర్ వేళ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి.. భారత్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఈవెంట్లు, పార్టీలు.. ఇలా హుషారెత్తించారు.. ఈ సమయంలో లిక్కర్ సేల్స్ కూడా అమాంతం పెరిగిపోయిన విషయం విదితమే.. అయితే, నూతన సంవత్సర వేడుకలు కోనసీమలో విషాదంగా మారాయి. అర్ధరాత్రి యువకుల రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారి, కత్తి మరియు బీర్ బాటిళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్‌ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్ బాటిల్‌తో దాడి చేసి పొడిచారు.. దాడి అనంతరం గాయపడిన యువకులు రక్తస్రావంతో కుప్పకూలారు.. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇక, సమాచారం అందుకున్న పి. గన్నవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన 14 మంది యువకులపై కేసు నమోదు చేశారు.. ఘర్షణకు కారణాలు, ముందస్తు విభేదాలపై విచారణ జరిపించారు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. స్థానికుల కథనం ప్రకారం, యువకుల మధ్య పాత వ్యక్తిగత విభేదాలే ఈ ఘర్షణకు ప్రధాన కారణంగా అనుమానిస్తున్నారు. పండుగ రాత్రి కవ్వింపులు ఆ వివాదాన్ని మళ్లీ రగిల్చాయని తెలుస్తోంది. న్యూఇయర్ వంటి వేడుకల్లో మద్యం ప్రభావంతో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
