Mother Killed Her Daughter To Live With Boyfriend: సభ్యసమాజం తలదించుకునే సంఘటన తాజాగా వెలుగుచూసింది. తన ప్రియుడితో జీవితం కొనసాగించేందుకు, కన్నకూతురినే కడతేర్చిందో తల్లి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం చిన్నాపూర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో మంగళవారం పోలీసులకు పూర్తిగా కుళ్లిపోయిన ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. అక్కడే పోస్టుమార్టం చేసి, ఆ పాప ఎవరిదన్న విషయంపై విచారణ చేపట్టగా.. విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవాని, గురునాథం దంపతులదని తేలింది.
మేస్త్రీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న ఈ దంపతులకు నాగలక్ష్మి (6), గీతమాధవి (14 మాసాలు) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఐదేళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి ఈ దంపతులు షిఫ్ట్ అయ్యారు. గత నెల బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని నాగలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లింది. అంతే.. మళ్లీ ఆమె తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్‌లో ఆమె ఉందన్న విషయం తెలిసిందే! ఈ సమాచారాన్ని భర్త గురునాథంకు తెలియజేయగా.. జిల్లాకు వచ్చి ఎంక్వైరీచేశాడు. నగరంలోని పోలీసుల సహకారంతో, ఆమె ఆచూకీ కనుగొన్నాడు. ఇంటికి వెళ్లి చూసిన తర్వాత.. అందరూ షాక్‌కి గురయ్యే తెలిసింది. ఆమె తన ప్రియుడు దుండగుల శ్రీనుతో ఉందని గుర్తించారు.
అది సరే గానీ.. పెద్ద కూతురు నాగలక్ష్మీ అక్కడ కనిపించలేదు. చిన్నకూతురు గీతమాధురి మాత్రం ఆమె వద్దే ఉంది. దీంతో.. నాగలక్ష్మీ ఎక్కడ అని తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఆమెను గొంతు నులిమి చంపి, అడవిలో పారేశామని సమాధానం ఇచ్చారు. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉందని భావించి, కూతురిని చంపినట్లు ఆ కసాయి తల్లి చెప్పింది. దాంతో.. భర్త గురునాథం పోలీసులను ఆశ్రయించి, భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.