Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..

Medak

Medak

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో ఈ నెల 14న జరిగిన భారీ దోపిడీ కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యా నాయక్ తండాకు చెందిన జైరాం నాయక్ (45) జాదవ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. సహచరుడిగా తన బావ ఇప్పు సింగ్ (32) తో కలిసి నేరాలకు పాల్పడేవాడు. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను జైరాం తన తల్లి మాలి (80), చెల్లి సాంకి బాయి (28) లకు అప్పగించేవాడు. వారు ఆ సొత్తును గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టేవారు.

పోలీసులకు దొరికారిలా..
ఈ నెల 14న జరిగిన చోరీ కేసు విషయమై అడ్వకేట్‌తో మాట్లాడేందుకు వెళ్తుండగా.. రామాయంపేట్ వద్ద జైరాం నాయక్‌ను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు జైరాం జాదవ్, అతని తల్లి మాలి బాయిని పోలీసులు అరెస్ట్ చేయగా.. జైరాం బావ ఇప్పు సింగ్, చెల్లె సాంకి బాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఈ కిలాడీ ముఠాపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 17 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.