Site icon NTV Telugu

Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య

Ramavati Fake Death Case

Ramavati Fake Death Case

Man Sentenced To 10 Years For Killing Wife Who Turns Up Alive: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే! ఎంత అన్యోన్యత ఉన్నప్పటికీ, ఏదో ఒక సమయంలో సహనం కోల్పోయి గొడవలకు దిగుతుంటారు. ఆ తర్వాత మళ్లీ సర్దుకుంటారు. ఒకవేళ సఖ్యత కుదరకపోతే, విడాకులు తీసేసుకుంటారు. కానీ, ఇక్కడ ఓ భార్య మాత్రం తన భర్తకు చాలా పెద్ద శిక్ష వేసింది. చెయ్యి చేసుకున్న పాపానికి అతనికి బుద్ధి చెప్పాలనుకొని, తాను చనిపోయినట్లు కథ అల్లింది. పాపం, చేయని నేరానికి అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

2006లో జాంపూర్‌ గ్రామానికి చెందిన కంధాయ్‌ అనే వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతితో వివాహం అయ్యింది. వీళ్ల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ, 2009లో ఒక రోజు రమాదేవి హఠాత్తుగా మాయమైంది. ఆమెను ఎంత వెతికినా దొరకలేదు. దీంతో.. కాంధాయ్‌ను రమావతి బంధువులు కోర్టుకు ఈడ్చారు. తమ బిడ్డను అతడు హత్య చేశాడంటూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఎనిమిదేళ్లు గడిచిపోయినా.. రమావతి జాడ కనిపించకపోయేసరికి, కంధాయ్ ఆమెని చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. 2017లో స్థానిక కోర్టులో అతడ్ని హాజరు పరచగా.. భార్యని చంపిన కేసులో అధిష్టానం అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అనుభవించిన తర్వాత.. అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నాడు.

కట్ చేస్తే.. రమావతి, కంధాయ్‌ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి, ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి రమావతి కనిపించింది. దీంతో ఖంగుతిన్న అతగాడు, వెంటనే సమాచారాన్ని కంధాయ్‌కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసి, కంధాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాడు. తన బంధువులతో కలిసి రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పుడో చనిపోయిందనుకున్న రమావతి, తమ కళ్ల ముందే ప్రాణాలతో ఉండటం చూసి అందరూ షాకయ్యారు. అక్కడి నుంచి ఆమెను వన్‌ స్టెప్‌ సెంటర్‌(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి, చనిపోయినట్టు ఎందుకు నటించావని ఆరా తీశారు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని, అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలేం చెప్పిందో తెలుసా?

2009లో చాయ్ విషయంలో భర్త తనతో గొడవ పడ్డాడని, అప్పుడు అతడు తన మీద చెయ్యి చేసుకున్నాడని రమావతి తెలిపింది. అది నచ్చకనే, భర్తను జైలు పాలు చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ నాటకానికి తెరలేపానని తెలిపింది. ఈ సమాధానంతో పాటు ఇన్నేళ్లపాటు తన జాడ కనిపించకుండా గోప్యంగా ఉండడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఫేక్ డెత్ నాటకం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Exit mobile version