Site icon NTV Telugu

Cockfight Attack: కోడి పందెం గెలిచిన వ్యక్తిపై బ్లేడ్‌తో దాడి..

Cockfight Attack

Cockfight Attack

Cockfight Attack: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మూడో రోజు కూడా జోరుగా కోడి పందాలు నిర్వహించారు.. కోట్ల రూపాయల్లో చేతులు మారాయి.. అయితే, కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణ గుళ్ళ ప్రాంతంలో జరిగిన కోడి పందెం ఘర్షణ హింసాత్మకంగా మారింది. కోడి పందెంలో గెలిచిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడివాడ ధనియాల పేటకు చెందిన అనగాని జగన్నాథం (45) కోడి పందెంలో గెలిచిన అనంతరం ఓడిన పుంజును తీసుకుంటుండగా, అక్కడే ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా బ్లేడ్‌తో అతని మెడపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో జగన్నాథానికి మెడపై తీవ్ర గాయమైంది.

Read Also: Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ

ఇక, గాయపడిన జగన్నాథాన్ని వెంటనే గుడివాడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న గుడివాడ ఏరియా హాస్పిటల్ పోలీస్ ఔట్‌పోస్ట్ సిబ్బంది ఘటన వివరాలను సేకరించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోడి పందేల నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు.

Exit mobile version