NTV Telugu Site icon

Malkajgiri Couple Suicide: సోషల్ మీడియాలో కలిసిన జంట.. పెళ్లయ్యాక ఆత్మహత్య

Malkajgiri Couple Suicide

Malkajgiri Couple Suicide

Malkajgiri Couple Commits Suicide After Girl Parents Seperated Them: ఆ జంట సోషల్ మీడియాలో కలిసింది. తొలుత మాటలు.. ఆ తర్వాత మనసులు కలిశాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. దీంతో, రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, ఇంతలోనే కులం అడ్డొచ్చింది. అది ఆ ఇద్దరిని వేరు చేసింది. తిరిగి కలవాలని ఎంత ప్రయత్నించినా, కులం వారిని కలపలేదు. దాంతో, ఒకరిని వదిలి మరొకరు ఉండలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

అబ్బాయి పేరు శ్రీకాంత్.. అమ్మాయి పేరు నికిత. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో శ్రీకాంత్ నివసిస్తుండగా.. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నికిత నివాసముంటోంది. రెండు సంవత్సరాల క్రితం ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. రానురాను వీరి అభిరుచులు కలవడంతో, మనసులు కూడా కలిశాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట.. జూన్ 4వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కలిసి ఉన్నారు. కానీ, నికిత తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్లు పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీకాంత్ మైనర్ అని తేలడంతో, నికితను తల్లిదండ్రులకు అప్పగించారు.

కానీ.. శ్రీకాంత్ బంధువులు వాదన మరోలా ఉంది. శ్రీకాంత్ వేరే కులం కావడంతో, నికిత తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అందుకే వాళ్లు పోలీసుల సహాయంతో నికితను, శ్రీకాంత్‌ని విడగొట్టారని తెలిపారు. పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీకాంత్, నికిత సంతోషంగా ఉండేవారని.. కానీ నికిత తల్లిదండ్రులు విడదీయడంతో వాళ్లు తీవ్రంగా కుంగిపోయారని పేర్కొన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక.. వాళ్లిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆగస్టు 15వ తారీఖున నికిత సూసైడ్ చేసుకోగా.. ఆగస్టు 17న శ్రీకాంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నికిత తల్లిదండ్రులు చేసిన తప్పు వల్లే.. ఇద్దరు ప్రేమికులు చనిపోయారని శ్రీకాంత్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.