Kurnool: శివారు ప్రాంతాలే వారి అడ్డా… జనసంచారం లేని ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలే వారి టార్గెట్. మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఊరి చివరలో.. చెట్ల పొదల్లో.. యువతీ యువకులు కనిపిస్తే వారికి పండగే. వారి దగ్గరున్న డబ్బులు, బంగారం దోచుకోవడం.. ఆ తరువాత కూడా వారికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం..ఇదే వారి పని. ఇలాంటి ముఠాకు కొందరు పోలీసుల అండదండలు కూడా ఉన్నాయనే అంశం ఇప్పుడు కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.
కర్నూలు శివారులో ప్రేమ జంటల సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తారు. రాయలసీమ యూనివర్సిటీ వైపు, రింగ్ రోడ్డు, జగన్నాథ గట్టు.. ఇలా శివారు ప్రాంతాల వైపు వెళ్లే ప్రేమ జంటలపై నిఘా పెడతారు. యువతీ యువకులు గుర్తించకుండా వారిని అనుసరించి… ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లి బెదిరిస్తారు. ఫోటోలు తీస్తారు. ఇంట్లో చెప్తామని బెదిరిస్తారు. ఇదీ.. కర్నూలులో కొంత మంది ఆకతాయిల నిత్యకృత్యంగా మారింది.
Crime News: అడవిలో అమ్మాయి డెడ్ బాడీ.. చుట్టూ క్షుద్రపూజల ఆనవాళ్లు!
వారి ఫోటోలు, వీడియోలు .. సోషల్ మీడియాలో పెడతామంటారు. దీంతో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఆ జంట భయపడి బెంబేలెత్తిపోతుంది. ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని తమ దగ్గర ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలు ఇచ్చేసి అక్కడి నుంచి బయటపడతారు. ఈ వ్యవహరమంతా కర్నూలులో ఆవారాగా తిరిగే ఓ ముఠా నడిపిస్తోంది. వీరికి కొందరు పోలీసులు కూడా వంతపాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ ముఠా చేసే దందాలో కొంత మంది పోలీసులకీ కొంత మొత్తం ముడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రేమ జంటలు టార్గెట్‌గా చేస్తున్న వసూళ్ల వ్యవహారంపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు అందింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు బంగారు దోచుకుంటున్నారు నిందితులు. ఓ యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కొని డబ్బుల కోసం.. మళ్లీ ఫోన్ చేసి డిమాండ్ చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
Mrunal Thakur : సోఫాలో పడుకుని వయ్యారాలు చూపిస్తున్న మృణాల్
ఆగస్టు 19న ప్రేమ జంట యూనివర్సిటీ వైపు ఆటోలో వెళ్తుండగా ముగ్గురు యువకులు.. ఆటో ఆపేసి తాము పోలీసులమని చెప్పారు. ఆ ప్రేమజంట ఎక్కడికి వెళ్తున్నదీ తమకు తెలుసని ఫోటోలు, వీడియోలు తీశారు. మీ తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించారు. దీంతో యువతి స్నేహితుడు రూ.2 వేలు ఫోన్ పే చేశారు. బెదిరించి 15 గ్రా. బంగారు గొలుసు కూడా లాక్కున్నారు. జేబులో ఉన్న మరో వెయ్యి రూపాయలు కూడా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా యువతికి ఫోన్ చేసి రూ. 5 వేలు ఫోన్ పే చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి ముజఫర్ నగర్‌కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, ప్రజానగర్ రమేష్, దిన్నెదేవరపాడుకు చెందిన మాలిక్ బాషాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, రూ.10,500 నగదు, సెల్ ఫోన్లు, స్కూటీ, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్టయిన నిందితులు.. ఈ వ్యహారంలో ఆరితేరిపోయారు. గొర్లగుట్ట నాగేంద్ర గతంలో ఇళ్లలో చోరీలు కూడా చేశాడు. అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. జగన్నాథ గట్టు అడ్డాగా ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారు దోచుకోవడానికి అలవాటు పడ్డాడు. ప్రేమ జంట భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారని భావించాడు. ఇదే క్రమంలో కొంత మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక నిందితులకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోమ్ గార్డు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై అంతర్గత విచారణ కొనసాగుతొంది.
