Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!

  • మక్తల్‌లో కృష్ణ జింకల వేట కలకలం
  • ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఆయుధాల స్వాధీనం
  • 12 జింకలు, 4 నెమళ్ల హత్య బయటపడ్డ నిజాలు
  • వన్యప్రాణుల సంరక్షణపై టాస్క్ ఫోర్స్ కఠిన నిఘా
Krishna Deer

Krishna Deer

Krishna Deer Hunting : నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కలకలం రేపింది. కృష్ణ జింకలను వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మక్తల్ ప్రాంతంలో జింకలను వేటాడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ వేటలో పాల్గొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లైసెన్స్‌డ్ రైఫిల్ తో పాటు 3 ఎయిర్ గన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలను అంగీకరించారు. ఇప్పటివరకు తాము 12 కృష్ణ జింకలను, 4 నెమళ్లను కాల్చి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కేవలం వినోదం కోసమో లేదా ఇతర అవసరాల కోసమో ఈ మూగజీవాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు గట్టి నిఘా ఉంచారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసును అటవీ శాఖ అధికారులకు అప్పగించి, తదుపరి విచారణను వేగవంతం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.