NTV Telugu Site icon

Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ

Kolkatatraineedoctorrape

Kolkatatraineedoctorrape

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజులు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 103 (హత్య) కింద అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడిని శనివారం సీల్దా కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. 14 రోజులు పోలీసు రిమాండ్‌కు సిటీ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యాచారానికి సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆగస్టు 23 వరకు 14 రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు.

కోల్‌కతా ఆర్‌జీ కేర్ మెడికల్ ఆస్పత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. అనంతరం ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌ను కుదిసింది. డాక్టర్లు, నర్సులు, విద్యార్థి సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తక్షణమే నిందితుల్ని శిక్షించకపోతే విధుల్ని బహిష్కరిస్తామని మెడికోలు హెచ్చరికలు జారీ చేశారు.

డాక్టర్ హత్య కేసు వ్యవహారంపై దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన నిందితులను అవసరమైతే ఉరితీస్తామని ప్రకటించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో మెడికోలు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రోగులకు డాక్టర్లు ఇబ్బంది కలిగించొద్దని.. తక్షణమే విధుల్లో చేరాలని సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమైందని.. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గురువారం అర్ధరాత్రి సమయంలో సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున చూసే సమయానికి ఆమె నగ్నంగా శవమై పడి ఉండడాన్ని చూసి సహచరులు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోస్టుమార్టం రిపోర్టు..
ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా గుర్తించారు. అలాగే ఆమె ప్రైవేటు భాగాల నుంచి రక్తస్రావం అయినట్లుగా తేలింది. అలాగే ఇతర శరీర భాగాలపైన కూడా గాయాలు ఉన్నట్లుగా నివేదికలో తేలింది. ఆమె రెండు కళ్లు, నోటి నుంచి రక్తస్రావం అయింది. ముఖం మీద గాయాలతో పాటు ఒక గోరును గుర్తించారు. అంతేకాకుండా ఆమె బొడ్డు, ఎడమ కాలు, మెడ, కుడి చేతి ఉంగరపు వేలికి గాయాలు గుర్తింపబడ్డాయి. ఇక పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లుగా శవపరీక్షలో తేలింది. ఈ ఘటన తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు క్రైమ్ విభాగం సభ్యులతో సహా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఇక అరెస్టయిన నిందితులకు ఆసుపత్రిలోని పలు విభాగాల్లో ఉచిత ప్రవేశం ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇతని చర్యలు ప్రత్యక్షంగా ఉన్నట్లుగా తెలుస్తోందని పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Show comments