ఖమ్మం జిల్లాలో కొంత మంది టీడీపీ కార్యకర్తలు సైబర్ వలలో పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం చెందిన కాకర్లపల్లికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలకు ఓ వ్యక్తి వీడియో కాల్ చేశాడు. తనను తాను మాజీ మంత్రి దేవినేని ఉమ పీఏగా పరిచయం చేసుకున్నాడు. తాను దేవినేని ఉమాతో మాట్లాడి.. చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఆయా టీడీపీ కార్యకర్తలకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను, బీఫామ్‌లను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ తమ ఖర్చుల కోసం డబ్బులు పంపించమని కోరాడు. దీంతో అంతా నిజమే అనుకుని నమ్మారు ఆ టీడీపీ కార్యకర్తలు. అతనికి 35 వేల రూపాయలు పంపించారు… స్పాట్..
ఇక ఆ వ్యక్తి అందరినీ విజయవాడలోని ఓ హటల్‌కు రమ్మన్నాడు. హోటల్‌లో రూమ్, భోజనాలు ఖర్చు అంతా తమదేనని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది.. కానీ చిన్న లిటిగేషన్ పెట్టాడు. చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లాలంటే తలా 10 వేల రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టాడు. దానికి ఒప్పుకున్న 10 మంది టీడీపీ కార్యకర్తలు హోటల్‌కు వెళ్లారు. చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్తానన్న వ్యక్తి కూడా హోటల్‌కు వచ్చాడు. కానీ ఆయన బిజీగా ఉన్నారని.. కాసేపట్లో వీడియో కాల్ చేసి మాట్లాడుతారని చెప్పుకొచ్చాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఓకే అన్నారు. చివరకు ఆ వ్యక్తి.. ఫోన్ చేయించినట్లుగా చెప్పి.. చంద్రబాబుతో వీడియో కాల్ మాట్లాడించాడు..
సరిగ్గా ఇక్కడే ఓ టీడీపీ కార్యకర్తకు అనుమానం వచ్చింది. అది AI కాల్‌గా గుర్తించాడు. దానిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వ్యక్తి మెల్లగా జారుకున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు.. హోటల్ బిల్లు చెల్లించి ఖమ్మం తిరుగు పయనమయ్యారు. నిజానికి చంద్రబాబు.. ఫోన్‌లో మాట్లాడడం.. కొంత మందితో వీడియో కాల్స్ మాట్లాడడం పరిపాటే. అలాగే తమతోనూ చంద్రబాబు ఫోన్ కాల్ మాట్లాడతారని అంతా భావించారు. కానీ చివరికి సైబర్ నేరగాళ్ల పని అని తెలిసి షాక్ అయ్యారు.
మరోవైపు సైబర్ నేరగాళ్లు తమ వద్ద NTR ట్రస్ట్ కోసం కూడా డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేశారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. చివరకు లక్షల్లో కాకుండా.. కేవలం 35 వేల రూపాయలతోనే తప్పించుకున్నామని కాస్తంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే సైబర్ నేరగాళ్లను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు..
