KBC Lottery Frauds – Huge Cases Filing In Hyderabad: సైబర్ నేరగాళ్ల అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటోన్నా.. సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తూ, జనాలను బురిడీ కొట్టించి, వారి నుంచి లక్షల రూపాయలు దోచేసుకుంటున్నారు. అటు.. సైబర్ నేరాల గురించి పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తోన్నా, కొందరు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహంలో ఎవరో ఒకరు చిక్కుకుంటూనే ఉన్నారు. రకరకాల ఆఫర్లు, లాటరీలతో జనాల్ని టెంప్ట్ చేసి టోకరా వేస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని వెలుగులోకి వచ్చింది. నిజానికి.. సైబర్ నేరగాళ్లు ఈ వ్యూహాన్ని ఎప్పట్నుంచో అమలు చేస్తూనే వస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో భాగంగా మీకు లాటరీ అవకాశం వచ్చిందంటూ చెప్తూ, మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆ కార్యక్రమం జాతీయంగా విశేష ఆదరణ పొందిన గొప్ప షో కావడంతో.. బహుశా లాటరీ తమకు నిజంగానే వచ్చిందేమోనని టెంప్ట్ అవుతున్నారు. దీంతో, దీన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈమధ్యకాలంలో కౌన్ బనేగా కరోడ్‌పలి లాటరీ పేరుతో తాము మోసపోయామంటూ పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.
తొలుత కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీలో మీ పేరు వచ్చిందని నమ్మిస్తారు. భారీ డబ్బులు వచ్చాయని ఆశ చూపించి, వాటిని మీ ఖాతాలో జమ చేస్తామని చెప్తారు. అందుకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అడుగుతారు. ఆ తర్వాత ఒక లింక్ పంపించి, దాన్ని క్లిక్ చేయమని చెప్తారు. అది క్లిక్ చేస్తే మాత్రం.. ఖాతాలో ఉన్న డబ్బులన్నీ గోవిందా గోవిందా! ఫోన్ హ్యాక్ చేసి, ఖాతా నుంచి మనకు తెలియకుండానే డబ్బులు కొట్టేస్తారు. ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తోన్న తరుణంలో.. లాటరీ వచ్చిందంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
