Site icon NTV Telugu

Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

Job Seek

Job Seek

హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ పోలీసులు నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఒక భారీ విదేశీ ఉద్యోగాల ముఠా గుట్టును రట్టు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న “ట్రివియల్ చాప్టర్” అనే సంస్థపై ఉక్కుపాదం మోపిన పోలీసులు, ఆ సంస్థకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. విదేశాలకు వెళ్లి లక్షల్లో సంపాదించాలనే కోరికతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ముఖ్యంగా గ్రీస్, రొమేనియా, ఇటలీ మరియు సెర్బియా వంటి దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను వేదికగా చేసుకుని ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించారు.

ఈ కేటుగాళ్లు ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి, నమ్మకం కలిగించడానికి ఆన్‌లైన్ టెంప్లేట్ల ద్వారా సృష్టించిన నకిలీ ఆఫర్ లెటర్లు , ‘వర్క్ ఆథరైజేషన్’ పత్రాలను అందజేశారు. ఒకసారి డబ్బు చేతికి అందాక బాధితుల ఫోన్ కాల్స్ ఎత్తకుండా, కనీసం సందేశాలకు కూడా సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసేవారు. విచారణలో ఈ సంస్థకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అధికారిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేదని తేలింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న పోలీసులు దాడి చేసి సంస్థ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంస్థ సీఈఓ, వ్యవస్థాపకుడు సహా మరో ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో కేపీహెచ్‌బీ స్టేషన్ పరిధిలోనూ ఈ సంస్థ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కేవలం అధికారిక ‘ఈ-మైగ్రేట్’ పోర్టల్ ద్వారానే ఏజెంట్ల వివరాలు సరిచూసుకోవాలని, అనధికార సంస్థలకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version