Site icon NTV Telugu

IRDAI Fraud: వీడు మాములోడు కాదు.. పని చేస్తున్న కంపెనీలో డబ్బు కొట్టేయాలని ప్లాన్

Irdai Fraud

Irdai Fraud

IRDAI Fraud: అప్పు.. తప్పులు చేయిస్తుంది. అవును మీరు విన్నది కరెక్టే.. అలా అప్పులు చేసిన ఓ ఉద్యోగి.. ఏకంగా తాను పని చేస్తున్న కంపెనీకే కన్నం పెట్టాడు. కోట్ల రూపాయల సొమ్మును అక్రమంగా కొట్టేశాడు. చివరకు అంతర్గత విచారణలో ఉద్యోగి బాగోతం బయట పడింది. చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నిజానికి ఈ సంస్థలో లైబ్రేరియన్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అంచెలంచలుగా అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకున్నాడు. నెలకు రూ.2.5 లక్షల జీతం తీసుకుంటున్నాడు.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సూర్యనారాయణ శాస్త్రి కొన్ని కారణాలతో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేకపోవడంతో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి వేధింపులు షురూ అయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదన చెందిన సూర్యనారాయణ శాస్త్రి.. చివరకు ఓ కన్నింగ్ స్కెచ్చేశాడు. తాను పని చేస్తున్న IRDAI సంస్థలోనే నగదు కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. తద్వారా అప్పులు తీర్చుకోవచ్చని ప్లాన్ చేశాడు…

READ ALSO: Kurnool Murder: పట్టపగలే మర్డర్ కలకలం.. తన మీదే అనుమానం..

IRDAI సంస్థ.. కొన్ని అవసరాల కోసం వాహనాలను తీసుకోవడం.. అలాగే సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం.. ఇంకా పలు సందర్భాల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులను సంబంధిత అధికారులు ఇన్‌వాయిస్‌ల మీద సంతకం చేసి చెల్లిస్తూ ఉంటారు. ఈ ఇన్‌వాయిస్‌ల్లోనే ఆయా కంపెనీలకు చెందిన అకౌంట్ నెంబర్లు ఉంటాయి. ఎప్పుడైతే, నగదు చెల్లించాల్సి ఉంటుందో ఆ ఇన్‌వాయిస్‌లపై సంతకాలు చేస్తారు అధికారులు. అదే టైంలో సూర్యనారాయణ, తన అప్పులు తీర్చుకోవడానికి, నకలి ఇన్‌వాయిస్‌లను తయారు చేశాడు. అలాగే అకౌంట్‌ నెంబర్లను తనతో పాటు తన కుటుంబసభ్యులకు చెందిన మరోఐదు అకౌంట్లను సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఇన్‌వాయిస్‌ల మీద సంతకాలు పెడతారో అప్పడు నకిలీవి ఉంచి, ఆ నగదు మొత్తాన్ని తన అకౌంట్‌లోకి బదిలీ చేసుకునే వాడు. ఇలా IRDAI సంస్థ నుండి తన అకౌంట్‌లతో పాటు తన కుటుంబసభ్యుల అకౌంట్‌లోకి నగదు బదిలీ చేసుకున్నాడు…

సూర్యనారాయణ శాస్త్రి చేస్తున్న ఈ నకిలీ బాగోతంపై ఎవరికీ డౌట్ రాలేదు. కానీ ఐఆర్‌డీఏఐ సంస్థకు మహీంద్రా కంపెనీకి చెందిన ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ కంపెనీకి రావాల్సిన నగదు చెల్లింపులు జరగడం లేదని అధికారుల దృష్టికి తీసుకుళ్లారు. దీంతో కంగుతిన్న అధికారులు.. ప్రతి నెల తాము ఇన్‌వాయిస్‌ల్లో సిగ్నేచర్స్‌ చేస్తున్నామని గుర్తించారు. నగదు సంస్థ అకౌంట్‌ నుంచి విత్‌ డ్రా అయినట్లు కూడా గుర్తించారు. అధికారులు అసిస్టెంట్‌ మేనేజర్‌ సూర్యనారాయణపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సైబరాబాద్‌ ఎకానమిక్‌ అఫెన్స్‌ వింగ్‌ అధికారులకు ఐఆర్‌డీఏఐ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సూర్యానారాయణ శాస్త్రిని అదుపులకి తీసుకొని విచారించారు. విచారణలో గతేడాది మార్చి నుంచి నకిలీ ఇన్‌వాయిస్‌లతో నగదు బదిలీలు చేసినట్లు చెప్పాడని ఈఓడబ్ల్యూ అధికారులు చెబుతున్నారు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలా జీతం తీసుకుంటున్న సంస్థకే కన్నం పెట్టిన సూర్యానారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు ఈఓడబ్ల్యూ అధికారులు. సూర్యనారాయణ శాస్త్రిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెబుతున్నారు. ఈ నిధుల దుర్వినియోగం వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలుసుకుంటామంటున్నారు..

READ ALSO: Visakhapatnam : డ్రగ్స్ వినియోగంలో ఏపీలో వేగంగా విస్తరిస్తున్న విశాఖ.. ఆందోళనలో అధికారులు

Exit mobile version