ఇండోర్‌లోని MYH ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో నవజాత శిశువు మరణించిన కేసు మరోసారి వేడెక్కింది. ఐసీయూలో ఉన్న బాలిక నాలుగు వేళ్లను ఎలుకలు కొరికి చంపాయని గిరిజన సంస్థ JAYS ఆరోపించింది. మృతదేహాన్ని ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి కుటుంబానికి అప్పగించారు. అంత్యక్రియలకు ముందు శిశువు చేతి వేళ్లు కనిపించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు (ఎంవైహెచ్) ఆసుపత్రిలో ఎలుకలకు సంబంధించిన కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో నవజాత శిశువు మరణించిన కేసు పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఎలుకలు బాలిక నాలుగు వేళ్లను కొరికాయని, దాని కారణంగా ఆమె చనిపోయిందని గిరిజన సంస్థ జై ఆదివాసీ యువ శక్తి (జేవైఎస్) వెల్లడించింది. ఈ కేసులో ఆసుపత్రి వర్గాలు అబద్దాలు చెప్పి.. ఈ విషయాన్ని అణచి వేసేందుకు ప్రయత్నించిందన్నారు.
అయితే, ఆసుపత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం మధ్య, ఐసీయూలో చేరిన ఇద్దరు నవజాత బాలికలపై ఎలుకలు దాడి చేశాయి. ఇద్దరు బాలికలు ఇప్పటికే పుట్టుకతో వచ్చే వ్యాధులతో బాధపడుతూ.. చికిత్స సమయంలో మరణించారు. ఈ బాలికలలో ఒకరు ధార్ జిల్లాకు చెందిన దేవ్రామ్ అనే వ్యక్తి కుమార్తె, మరొక అమ్మాయి దేవాస్‌కు చెందినది. రెండు జిల్లాలు ఇండోర్ సమీపంలో ఉన్నాయి.
గిరిజన సంస్థ JAYS జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజల్దా అన్నారు. బాలిక మరణించిన తర్వాత, ఆసుపత్రి వారు ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి శనివారం సాయంత్రం కుటుంబానికి అప్పగించారని అన్నారు. అంత్యక్రియలకు ముందు కుటుంబం ప్యాకింగ్ తొలగించినప్పుడు, ఒక చేతికి చెందిన నాలుగు వేళ్లు కనిపించడం లేదని, ఎలుకలు వాటిని కొరికాయని వారు చూశారు. వేళ్లపై చిన్న గాయాలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం మొదట అబద్ధం చెప్పిందని, కానీ వాస్తవం వేరే ఉందని ఆయన ఆరోపించారు.
మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా ఆరోపణలను ఖండించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించిందని, దాని ఆధారంగా పరిస్థితి స్పష్టమైందని ఆయన అన్నారు. అయితే, పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ ,భద్రతా చర్యలలో మెరుగుదలలు జరుగుతున్నాయని ఆయన అంగీకరించారు. ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు ఆరుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుందని, వారిలో కొందరిని సస్పెండ్ చేసి పదవి నుండి తొలగించారని తెలిపారు.
