Retired IPS Officer Wife Murder Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, దోపిడీ కేసును సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT – నేపాల్ గ్యాంగ్), జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలోని నలుగురు కీలక సభ్యులను నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 51,130 నగదుతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది?
ఈ ఏడాది మే 7/8 తేదీల మధ్య రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాసన్ నగర్లో నివాసముంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య శ్రీమతి తనుజా రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం ఆమె కుమార్తె బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా.. చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి తనుజా రంజన్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాలు పగలగొట్టి, 225 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన పనిమనిషి ధర్మ అలియాస్ కల్పన కనిపించకుండా పోవడం, ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానాలు బలపడ్డాయి.
పక్కా ప్లాన్‌తో దోపిడీ, హత్య
గత ఏడాది జూన్‌లో పనిమనిషిగా చేరిన ధర్మ, పుణేలోని నేపాల్ ముఠా సభ్యుడైన బికాస్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపింది. యజమానుల ఆస్తులు, బంగారు నగల వివరాలను చేరవేసి చోరీకి ప్లాన్ వేసింది. మే 4న యజమాని బెంగళూరు వెళ్లగానే ముఠాకు సమాచారం అందించింది. పుణే, బెంగళూరుల నుంచి కార్లు, బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న ముఠా సభ్యులు.. మే 7వ తేదీ రాత్రి పనిమనిషి ధర్మ తలుపులు తీయడంతో లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో బాధితురాలు నిద్రలేవడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం నగల దోపిడీకి పాల్పడి పరారయ్యారు. కాజీపేట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి దోచుకున్న సొత్తును తొమ్మిది భాగాలుగా పంచుకుని నేపాల్‌కు పారిపోయారు.
రంగంలోకి ప్రత్యేక బృందం (SIT) – నేపాల్ సరిహద్దుల్లో వేట
మూడు కమిషనరేట్లలో నేపాల్ ముఠాల నేరాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ జి.ఎస్. డానియల్ శాంతి కుమార్ నేతృత్వంలో ప్రత్యేక ‘సిట్’ ఏర్పడింది. నిందితుల కోసం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, బిహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో గాలించిన బృందం.. ఏకంగా ఐదు నెలల పాటు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో క్యాంప్ వేసి పక్కా నిఘా పెట్టింది. చివరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకుంది.
అరెస్టైన నిందితులు
* ధర్మ తిరువా @ కల్పన (26): పనిమనిషి, సుర్ఖేత్, నేపాల్.
* గణేష్ బి.కె. @ దినేష్ థాపా (31): దైలేఖ్, నేపాల్ (ప్రస్తుతం పుణే).
* చంద్ర బహదూర్ తమంగ్ @ శంకర్ చంద్ర లామా (44): దోలాఖా జిల్లా, నేపాల్ (హర్యానా నివాసి).
* గణేష్ బహదూర్ షాహి (37): కైలాలి, నేపాల్ (ప్రస్తుతం పుణే).
ఈ ఆపరేషన్ కొనసాగుతుండగానే నేపాల్‌కు చెందిన పలువురు పాత నేరస్థులపై ఉన్న 5 నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBWs) సిట్ అమలు చేసి నిందితులను పట్టుకుంది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, ముంబైలలో 8 భారీ చోరీ కేసుల్లో నిందితుడైన జీవన్ చంద్ @ జీబన్ను అరెస్ట్ చేసింది. ఈ ముఠా బెంగళూరు, ఢిల్లీలలో ప్లాన్ చేసిన మరికొన్ని నేరాలను సైతం పోలీసులు అడ్డుకోగలిగారు.
నగర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ఇళ్లలో పనిమనుషులు, వంటవారు, వాచ్మెన్లుగా ఇతర రాష్ట్రాలు లేదా పరాయి దేశాల (నేపాల్ తదితర) వారిని నియమించుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
* సరైన గుర్తింపు పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి పోలీసు వెరిఫికేషన్ చేయించాలి.
* వారి కుటుంబ సభ్యులు, కనీసం ఐదుగురు బంధువుల వివరాలు, పాత యజమానుల కాంటాక్ట్ నంబర్లు పరిశీలించాలి.
* కొత్తగా చేరిన వారి కదలికలపై నిఘా ఉంచాలి. లాకర్లు, నగదు, బంగారు ఆభరణాలు, ప్రయాణ వివరాల గురించి వారి సమక్షంలో చర్చించకూడదు.
* అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా వాట్సాప్ హెల్ప్‌లైన్ 94906 16555 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

