Site icon NTV Telugu

Hyderabad : నిన్న బంజారాహిల్స్‌.. నేడు లాలాగూడ! న‌గ‌రంలో ఏం జ‌రుగుతోంది?

Lalaguda

Lalaguda

భాగ్య నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ప‌దుల సంఖ్య‌లో హత్యలు జరగడం న‌గ‌ర వాసులు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు. పాత‌క‌క్ష్య‌ల‌తో ఒక‌రు, ఆస్తి కోసం మ‌రొకరు.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఇంకొకరు.. ఇలా ఇతరత్రా కారణాలతో హత్యలు జరుతూనే వున్నాయి. పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న హ‌త్య‌ల‌కు తావులేకుండా పోతోంది.

సికింద్రాబాద్‌ లోని లాలాగూడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండకు చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, 2017లో జరిగిన హత్యకేసులో అఫ్సర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. న‌గరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో కడుపులో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో గొడవ.. ఆపై హత్య చేసి పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా.. వ‌రుస హ‌త్య‌ల‌తో నగరవాసులు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు. ఎప్పుడు ఏంజ‌రుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని జీవ‌నం సాగిస్తున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి ఇటువంటి హ‌త్య‌లు జ‌ర‌కుండా ప‌కడ్భందీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు.

Cricket: సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్

Exit mobile version