వాహనాలకు నకిలీ ప్లేట్లకు బ్రేక్ పెడుతూ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ చేశారు..చలాన్లు తప్పించుకోవాలని నకిలీ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతుంటారు… నకిలీ నెంబర్ ప్లేట్లు తో తిరిగితే కటకటాలే అంటూ పోలీసులు చెపుతున్నారు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొరడా ఝళిపించారు ..100 వాహనాలు సీజ్, 100 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. నకిలీ నంబర్ ప్లేట్ తగిలిస్తే ఎవరికి తెలుస్తుందిలే.. పోలీసు కెమెరాల కళ్లు గప్పి ట్రాఫిక్ చలాన్ల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు’ అనుకుంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్న కేటుగాళ్ల ఆటలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. రాజధాని నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్ల దందాపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక నిఘా, విస్తృత తనిఖీలతో నకిలీల భరతం పడుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలు తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న 100 వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వాహనదారులపై ఏకంగా 100 క్రిమినల్ కేసులు నమోదు చేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలో వాహనాల గుర్తింపును మాయం చేయడానికి, పోలీసు చలాన్లు తప్పించుకోవడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ నంబర్ ప్లేట్లను తయారు చేయించడం, అసలు నంబర్లలోని అంకెలను మార్చడం (ట్యాంపరింగ్), ఫ్యాన్సీ ఫాంట్లు, స్టిక్కర్లతో నంబర్లను అస్పష్టంగా మార్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరనే ధీమాతో నగర వీధుల్లో యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. అయితే, ఇలాంటి చర్యలు కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రమే కాకుండా, పలు నేరాల్లో అనుమానితులు తప్పించుకోవడానికి, దర్యాప్తులకు విఘాతం కలిగించడానికి కారణమవుతున్నాయని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఉల్లంఘనులపై స్పెషల్ డ్రైవ్ నకిలీ నంబర్ ప్లేట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను ముమ్మరం చేసింది. నగరవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 100 వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది జప్తు చేశారు. సీజ్ చేసిన వాటిలో 88 ద్విచక్ర వాహనాలు, 12 కార్లు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మోటారు వాహనాల చట్టం–1988, సెంట్రల్ మోటారు వెహికల్ రూల్స్–1989 ప్రకారం ప్రతి వాహనానికి తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) ఉండాల్సిందేనని ట్రాఫిక్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నంబర్లలో మార్పులు చేసినా, అనధికార ఫాంట్లు, అలంకార స్టిక్కర్లు వాడినా కఠిన శిక్షలు తప్పవని తేల్చిచెప్పారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు వాడటం తీవ్రమైన నేరం. చలాన్ల నుంచి తప్పించుకోవాలని చూస్తే చివరకు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుంది. ఎవరైనా అనుమానాస్పద లేదా నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

