స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!

Drugs

Drugs

సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ (Snapchat) వేదికగా సాగుతున్న ఒక వ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ (EAGLE Force), హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ అధికారులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల అత్యంత ఖరీదైన ఓజీ కుష్ (OG Kush), ఒక గంజాయి క్రషర్, మూడు మొబైల్ ఫోన్లు మరియు రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

​పట్టుబడిన నిందితుల వివరాలు:
​1. మహ్మద్ ఇద్రీస్ కలీం అలియాస్ ఫరాన్ (28) [A-1]: టోలిచౌకి, సాలార్‌జంగ్ కాలనీ నివాసి (ప్రధాన సూత్రధారి).
​2. సయ్యద్ అబ్బాస్ హుస్సేనీ (30) [A-2]: ఆసిఫ్ నగర్ నివాసి (గతంలో రెస్టారెంట్ బిల్లింగ్ స్టాఫ్‌గా పనిచేశాడు).
​3. మహ్మద్ షేక్ (23) [A-3]: గోల్కొండ, చోటా బజార్ నివాసి (క్యాబ్ డ్రైవర్).
​4. షేక్ ఫర్హాన్ [A-4]: ముంబైకి చెందిన ప్రధాన సరఫరాదారు (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు).
​
పక్కా సమాచారంతో వలపన్ని పట్టివేత:
నవంబర్ 15, 2026న నిందితులు మణికొండలోని ల్యాంకో హిల్స్ నుంచి షిర్డీ సాయి నగర్‌లోని ‘జె.ఏ రాయల్ సూట్స్’ హోటల్ వైపు తెలుపు రంగు మారుతి టూర్ H3 కారులో (TG 07 Y 2937) డ్రగ్స్ తరలిస్తున్నట్లు నార్కోటిక్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో క్లూస్ టీమ్ సహాయంతో సాయంత్రం 6:35 గంటలకు పోలీసులు కారును అడ్డగించి తనిఖీ చేయగా గంజాయి, ఓజీ కుష్ పట్టుబడ్డాయి.

​స్నాప్‌చాట్ ద్వారా 900 మందికి సరఫరా:
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితులు ఇద్రీస్ (A-1), సయ్యద్ అబ్బాస్ (A-2) కలిసి “OGdude420” (OG BRO) పేరుతో స్నాప్‌చాట్ ఖాతాను నిర్వహిస్తూ వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకునేవారు. ఆ ఖాతా బ్లాక్ కావడంతో “Dude OG 420” పేరుతో కొత్త ఖాతా తెరిచి దందా కొనసాగించారు. వీరు ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా సుమారు 800 నుంచి 900 మంది కస్టమర్లకు ఓజీ కుష్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది.
​ముంబైకి చెందిన షేక్ ఫర్హాన్ (A-4) వద్ద నుంచి బస్సుల ద్వారా భారీ మొత్తంలో సరుకును హైదరాబాద్‌కు తెప్పించుకుని, ఇద్రీస్ వాటిని 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారు చేసేవాడు. క్యాబ్ డ్రైవర్ అయిన మహ్మద్ షేక్ (A-3) నగరంలోని వివిధ ప్రాంతాల్లో కస్టమర్లకు డెలివరీ చేసేవాడు.

​క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు లావాదేవీలు:
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు క్రిప్టో కరెన్సీని ఉపయోగించారు. ఇద్రీస్ తన క్రిప్టో ఖాతా ద్వారా ముంబై సప్లయర్లకు డబ్బు చెల్లించడంతో పాటు, కస్టమర్ల నుంచి కూడా క్రిప్టో రూపంలోనే డబ్బులు స్వీకరించాడు. రెండో నిందితుడు అబ్బాస్ మొబైల్‌ను పరిశీలించగా, హాంకాంగ్‌కు చెందిన ‘రీడాట్‌పే’ (RedotPay) క్రిప్టో ప్లాట్‌ఫారమ్ ద్వారా USDT (Tether) వాలెట్‌లోకి డబ్బులు జమ చేయించుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ వాలెట్‌లోకి డబ్బు పంపిన 11 మంది వినియోగదారులను, మరో అనుమానిత పెడ్లర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఆర్థిక మూలాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

​ఇద్రీస్‌పై పాత నేర చరిత్ర:
ప్రధాన నిందితుడు ఇద్రీస్‌కు పాత నేర చరిత్ర ఉంది. 2021-22లో బెంగళూరు ఎన్సీబీ (NCB) నమోదు చేసిన ఓజీ కుష్ కేసులో ఇద్రీస్, అబ్బాస్ అరెస్టయి 15 రోజులు జైలులో ఉన్నారు. అలాగే 2025 డిసెంబర్ 24న శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇద్రీస్‌ను అదుపులోకి తీసుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించగా, 73 రోజులు చర్లపల్లి జైలులో ఉండి 2026 మార్చి 8న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతనిపై చార్మినార్, బాలాపూర్, గోల్కొండ, మెహదీపట్నం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్లీ కొత్త సోషల్ మీడియా ఖాతాలతో దందా మొదలుపెట్టాడు.
​నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. పరారీలో ఉన్న ముంబై సరఫరాదారు షేక్ ఫర్హాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు