Husband Killed His Wife For Doing Reels On Instagram: వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లపాటు వారి సంసార జీవితం సజావుగా సాగింది. ఒకవేళ ఏదైనా విషయంపై గొడవపడినా.. అప్పటికప్పుడే దాన్ని పరిష్కరించుకొని, అన్యోన్యంగా మెలిగేవారు. అలాంటి వారి మధ్య ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ చిచ్చు పెట్టింది. ఆ జంట మధ్య క్రమంగా ప్రేమ తగ్గిస్తూ.. ద్వేషం పెంచుతూ వచ్చింది. చివరికి పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే.. భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు భర్త. ఈ ఘటన బిహార్‌లోని భోజ్‌పుర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనిల్, అన్నూ ఖాతూన్‌లు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తంటే భార్యకు.. భార్యంటే భర్తకు ఎంతో ప్రేమ. పెద్దగా గొడవలు లేకుండా.. తమ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా గడుపుతూ వచ్చారు. అయితే.. కొంతకాలం నుంచి అన్నూ ఖాతూన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించింది. మొదట్లో అభ్యంతరం తెలపని భర్త.. ఆ తర్వాత వీడియోలు చేయొద్దని కోరాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. తనకు క్రమంగా లైక్స్, ఫాలోవర్లు పెరుగుతుండడంతో.. వీడియోలు చేస్తూ వచ్చింది. కామెంట్లు కూడా విపరీతంగా వచ్చేవి. భార్య వీడియోలు చేయడమే నచ్చని భర్తకు.. ఆ కామెంట్లు చూపి మరింత కోపం పెరిగింది.
వీడియోలు చేయొద్దని భార్యకు మరోసారి చెప్పాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అప్పుడు కూడా భార్య నిరాకరించింది. దీంతో ఉద్రేకానికి గురైన అనిల్.. తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనిల్‌ని అరెస్ట్ చేశాడు.
