NTV Telugu Site icon

Husband Dumped Wife: ఆడపిల్ల పుట్టిందని.. భార్యని గెంటేసిన భర్త

Husband Dumped Wife

Husband Dumped Wife

Husband Dumped His Wife For Giving Birth To Girl Child: తనకు జన్మనిచ్చిన తల్లి ఓ మహిళ.. తాను పెళ్లి చేసుకుంది కూడా ఓ మహిళనే.. కానీ తనకు పుట్టిన ఆడపిల్ల వద్దంటూ భార్యను గెంటేశాడు ఓ ప్రబుద్ధుడు. అత్తమామలు కూడా కొడుకుకే వత్తాసు పలుకుతూ.. కోడల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో.. భార్య తన చంటిపాపని తీసుకొని, భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన స్పందనకు, జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల కిరణ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్లపాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

కొడుకును కంటావనుకుంటే.. కూతురిని కన్నావంటూ తన భార్య స్పందనను వేధించడం మొదలుపెట్టాడు భర్త కిరణ్. చివరికి కాపురానికి రానిచ్చేది లేదంటూ.. పుట్టింటికి పంపించాడు. అప్పుడు స్పందన గ్రామపెద్దల్ని సంప్రదించి, తన గోడును వెళ్లబోసుకుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పంచాయితీ జరిగింది. ప్రతిసారీ కిరణ్‌దే తప్పని పెద్దలు తేల్చుతూ.. పద్ధతి మార్చుకోవాలని, భార్యను కాపురానికి తీసుకుపోవాలని సూచించారు. కొన్నిరోజుల కిందట కూడా జరిగిన పంచాయితీలో.. భార్యను కాపురానికి తీసుకుపోతానని కిరణ్ చెప్పాడు. కానీ, అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడే తప్ప భార్యని కాపురానికి తీసుకుపోలేదు. దీంతో మరోసారి పంచాయితీ పెట్టగా.. ఈసారి తాను తన భార్యని కాపురానికి తీసుకుపోయేదే లేదని కిరణ్ తేల్చి చెప్పాడు. ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో చేసేదేమీ లేక.. బాధితురాలు స్పందన తన బంధవులతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే.. భార్య వస్తోందన్న విషయం ముందే తెలుసుకున్న కిరణ్, ఇంటికి తాళం వేసి తన తల్లిదండ్రులతో కలిసి పారిపోయాడు. బాధితురాలు మాత్రం తమకు న్యాయం జరిగేంతవరకు ఇంటి ముందు నుంచి వేళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ.. తమ పచ్చని కాపురంలో అత్తమామలు చిచ్చు పెట్టారని, ఆడపిల్లను కన్నావంటూ భర్త సహా అత్తమామలు వేధించారని ఆరోపించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది.