ఆ యువతి ఓ అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. తనే సర్వస్వమని నిర్ణయించుకుంది. ఆ అబ్బాయి కూడా యువతిని ప్రేమించాడు. కానీ, పెళ్లి విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విశాఖపట్నం భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కొయ్య లావణ్య (16) అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ యువతి అదే గ్రామంలో ఉండే మణికుమార్‌ని ప్రేమించింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరు.. పెళ్ళి బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. కానీ, ఇక్కడే అసలు వ్యవహారం తేడా కొట్టేసింది. పెళ్లికి మణికుమార్ నిరాకరించడంతో.. తీవ్ర మనస్థాపానికి గురై లావణ్య ఉరేసుకుందని కొందరు చెప్తున్నారు. మరికొందరు మాత్రం.. మణికుమార్ కుటుంబీకులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా, వారు నిరాకరించారని పేర్కొంటున్నారు.
కారణాలు ఏవైనా, తనకు ప్రేమించినవాడు దక్కడం లేదన్న బాధతో లావణ్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె చనిపోయినట్లు తేలింది. విభిన్న కథనాలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్‌లో లావణ్య ఉత్సాహంగా పాల్గొంది. ఇంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
