Pr*stitution : విదేశీ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకు వచ్చి.. గలీజ్ పనులు చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న ఓ యవతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. అసలు ఈ ముఠా ఏంటి? ఎంత కాలంగా వీళ్లు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన రూప, హైదరాబాద్‌లోని బండ్లగూడ, ఇస్మాయిల్ నగర్‌కు చెందిన హజీరా, మెహిదీపట్నంకు చెందిన షహనాజ్ ఫాతిమా, హఫీజ్ బాబానగర్‌కు చెందిన మహ్మద్ సమీర్, మరో నిందితుడు సర్వర్… ఓ ముఠాగా ఏర్పడ్డారు. అమాయకులైన యువతులను నమ్మించి వారిపై బెదిరింపులకు పాల్పడుతూ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. అలా బంగ్లాదేశ్‌లోకి ఈ ముఠా లింకులు చొచ్చుకుపోయాయి. ఆ దేశం నుంచి పేదింటి యువతులను టార్గెట్‌గా చేసుకొని దేశం దాటించి వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి…
6 నెలల క్రితం ఈ ముఠా సభ్యురాలైన బంగ్లాదేశ్‌కు చెందిన రూప, ఓ యువతిని ట్రాప్ చేసింది. ఇండియాలో చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయని.. నేను వెళ్తున్నాను.. నువ్వూ రా అంటూ ఆహ్వానించింది. అమ్మాయికి మాయమాటలు చెప్పింది. రూప క్రియేట్ చేసిన ఆ క్యూరియాసిటితో యువతి ఇండియాకు వచ్చేందుకు సరే చెప్పింది. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పొద్దని, చెబితే పంపించరని ఆ యువతిని రూప ట్రాప్ చేసింది. అలా ఆ యువతిని తీసుకొని తన కూతురంటూ నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్, ఇండియా సరిహద్దుల్లో ఉన్న నదిని బోట్ సహాయంతో దాటించింది. అక్కడి నుండి ఇద్దరూ కోల్‌కతాకు చేరుకున్నారు. ట్రైన్‌లో బంగ్లాదేశ్ యువతిని హైదరాబాద్‌కు తీసుకువచ్చింది రూప. మెహిదీపట్నంలోని షెహనాజ్ ఫాతిమా ఇంటికి వచ్చారు. అక్కడ షేహనాజ్ ఫాతిమాకు బంగ్లాదేశ్ యువతిని అప్పగించి, ఆ యువతికి మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ వెళ్లిపోయింది రూప. షెహనాజ్ ఇంటికి వచ్చిన మహ్మద్ సమీర్, బంగ్లాదేశ్ యువతిని హజీరాబేగం ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిని బెదిరించిన హజీరాబేగం.. వ్యభిచారం చేయడానికి ఒప్పుకోకపోతే అక్రమంగా దేశంలోకి చొరబడ్డావని, పోలీసులకు సమాచారం ఇస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ ఆ యువతిని వ్యభిచార కూపంలోకి దింపారు. ఆరు నెలల పాటు నరకయాతన అనుభవించింది ఆ యువతి…
వ్యభిచారం చేయించటానికి బండ్లగూడలోని హజీరాబేగం ఇంటి నుంచి తీసుకొని వెళ్లడం.. తిరిగి తీసుకు రావడం సమీర్ పని. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌ను గమనించింది యువతి. 10 రోజుల క్రితం సరిగ్గా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని హోటల్‌లో తినేందుకు ఆటో ఆపాడు సమీర్. ఆటో పార్క్ చేసేందుకు వెళ్లిన సమయంలో అదే అదనుగా భావించి యువతి..పోలీసు స్టేషన్‌లోకి వెళ్లింది. విషయం చెప్పడంతో పోలీసులు భరోసా ఇచ్చారు. ఆమె స్టేట్‌మెంట్ తీసుకుని హజీరాబేగం, షెహనాజ్ ఫాతిమా, సమీర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో బంగ్లాదేశ్ కు చెందిన రూప, హైదరాబాద్‌కి చెందిన సర్వర్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంతో మందిని ట్రాప్ చేశారో కస్టడీలోకి తీసుకుని నిగ్గు తేల్చనున్నారు పోలీసులు…
