Family Disputes: కుటుంబ కలహాలు.. కాపురాలను ఆగమాగం చేస్తున్నాయి. అంతే కాదు.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఉసురు తీస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలు.. క్షణికావేశం.. కారణం ఏదైనా కావచ్చు.. అభం శుభం ఎరుగని పిల్లలు బలవుతున్నారు. పైగా కాపురంలో భార్యనో, భర్తనో చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు. కర్నూలు జిల్లాతోపాటు హైదరాబాద్ బోరబండలోనూ ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపేసి తాము కూడా సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనలతో వాళ్ల ఇళ్లల్లో తీరని విషాదం నెలకొంది. అటు హయత్ నగర్‌లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను చంపేశాడు. కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో 3 మృతదేహాలు కలకలం రేపాయి. గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను బయటికి తీసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి, సుకుమార్, అబ్రహంగా గుర్తించారు. వారిని తల్లీ ఇద్దరు కొడుకులుగా నిర్ధారించారు.
READ ALSO: Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
14 ఏళ్ల క్రితం రాజేశ్వరికి అలంపూర్‌కి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే రాజేశ్వరి, రాజు మధ్య గొడవలు మొదలయ్యాయి. కొంతకాలం కర్నూలు జిల్లాలోని రాళ్లు కొట్టి జీవనం సాగించారు. కూలీ పనుల్లో ఉండగానే భార్యాభర్త మధ్య గొడవ జరిగి ఇనుపరాడ్‌తో రాజేశ్వరిని కొట్టాడు. అప్పుడే చావు అంచుల వరకు వెళ్లి.. చివరికి ప్రాణాలతో బయటపడింది. ఐతే వారి కాపురంలో తరచూ గొడవలు అవుతూనే ఉన్నాయి. పెద్దలు నచ్చచెప్పి కాపురానికి పంపడం జరుగుతుండేది. రాజేశ్వరి కలహాలతోనే కాపురం కొనసాగుతుండగా.. అలంపూర్ నుంచి పుట్టింటికి వచ్చిన రెండవ రోజే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించి ఇద్దరు పిల్లలను కూడా చెరువులో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరి భర్త రాజు మద్యానికి బానిసై.. భార్యను వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిపై అనుమానం పెంచుకుని మద్యం తాగి గొడవ పడేవాడని, వేధింపులు భరించలేకనే కూతురు ఆత్మహత్య చేకుందని రాజేశ్వరి తల్లి నాగమణి ఆరోపిస్తోంది. తన కుమార్తె మృతికి కారణమైన రాజును కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. రాజేశ్వరి భర్త రాజు మాత్రం భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలీదంటున్నాడు. అలంపూర్ నుంచి ఆసుపత్రికి వెళ్లాలని వచ్చిందని, ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదని చెప్పాడు. మరోవైపు ముగ్గురి మృతిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ బోరబండలోనూ ఇలాంటి తరహా విషాదమే నెలకొంది. తల్లి ఇద్దరు పిల్లలను గొంతు పిసికి.. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. రెండేళ్ల చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. ఆ మహిళ పేరు సత్యవాణి. ఈమెకు 2019లో మురళి వేణుతో వివాహం జరిగింది. ఆయన జూనియర్ లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వారికి రుద్రాన్ష్, తన్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే మార్చి 14న మురళి వేణు.. తన తండ్రిని డయాలిసిస్ కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చే సరికి సత్యవేణి.. ఇద్దరు పిల్లలు ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన మురళి వేణు.. వారిని స్థానికుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సత్యవేణి, రుద్రాన్ష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండేళ్ల తన్విక మాత్రం కొన ఊపిరితో ఉండగా.. చికిత్స అందిస్తున్నారు.
సత్యవాణి.. తన ఇద్దరు పిల్లలను చంపానని అనుకొని తను ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్నారులను గొంతు నులిమింది సత్యవాణి. కుమారుడు రుద్రాన్ష్ చనిపోగా, చిన్నారి తన్విక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఇద్దరు పిల్లలు చనిపోయారనుకొని సత్యవాణి ఆత్మహత్య చేసుకుంది. ఐతే.. పిల్లలను చంపి, సత్యవాణి ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలు ఏమి లేవని బందువులు అంటున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కుటుంబ కలహాలు కూడా లేవని తెలుస్తోంది. మరి అలాంటి సమయంలో ఎందుకు సత్యవాణి, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుందనేది తెలియాల్సి ఉంది. పిల్లలను చంపి తాను చనిపోవాలని అనుకుంది. అంటే కచ్చితంగా పిల్లలను తన భర్తకు దూరం చేయాలని అనుకున్నట్లుగానే తెలుస్తోంది. ఒకవేళ భార్యాభర్తల మధ్యో లేక కుటుంబ కలహాలో ఉంటే తను ఒక్కతే ఆత్మహత్యకు యత్నించేది. కానీ పిల్లలను కడతేర్చి, తాను చనిపోవాలని అనుకుంది అంటే కచ్చితంగా విభేదాలు తార స్థాయిలో లేక అనారోగ్య కారణాలో అయి ఉండాలి. కానీ సత్యవాణి భర్త మాత్రం.. తనకు ఏమి తెలియదని, తన తండ్రిని డయాలసిస్‌కు తీసుకొని వెళ్లి తీసుకువచ్చే సరికి దారుణం జరిగిందని అంటున్నాడు. మరోవైపు కాపురంలో చిచ్చి పెట్టిన కలహాలు హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఓ ఇల్లాలి ఉసురు తీశాయి. క్షణికావేశంలో ఓ భర్త తన భార్యను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ కూతురు చెప్పడంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు.
హయత్ నగర్ పరిధిలోని పసుమాములలో ఉమారాణి, ఆమె భర్త ఆంజనేయులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన గొడవతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త ఆంజేనేయులు క్షణికావేశంలో ఇంట్లోని సుత్తిని తీసుకుని భార్య తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. భార్య పరిస్థితి విషమించడంతో భయపడిన నిందితుడు ఆంజనేయులు.. అసలు విషయాన్ని దాచిపెట్టి డ్రామా ఆడాడు. ఆమె తల మీద పెయింట్ డబ్బా పడిందని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆమెను తక్షణమే యశోద ఆస్పత్రికి తరలించాడు. అయితే.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రి ప్రవర్తనపై, అతడు చెబుతున్న పెయింట్ డబ్బా కథనంపై మృతురాలి కూతుళ్లకు అనుమానం కలిగింది. వెంటనే వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది. కుటుంబ కలహాల కారణంగానే తానే స్వయంగా సుత్తితో కొట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Rishabh Pant: తగ్గేదే లే అంటున్న రిషబ్ పంత్! ఐపీఎల్ వేళ సంచలన మార్పులు..
