Facebook Friend Stolen 39 Lakhs From A Young Man In Karnataka: బయట ప్రపంచంలో ప్రేమ దొరక్క.. కొందరు యువకులు సోషల్ మీడియాలో ప్రేమను వెతుకుతుంటారు. ఎవరో ఒక అమ్మాయి తమకు పరిచయం కాకపోదా..? అనే ఆశతో నెట్టింట్లో ప్రయత్నాలు చేసుకుంటారు. దీన్నే ఆసరాగా తీసుకొని, గాలం వేసి, నిండా దోచేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా నిలువునా మోసపోయాడు. ఒక అమ్మాయిని నమ్మి.. ఏకంగా రూ. 39 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోకి విజయపుర జిల్లాకు చెందిన పరమేశ్వరకు నాలుగు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో మంజుల అనే ఒక అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని అతడు ఆక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత మాటలు కలపడం జరిగింది. క్రమంగా చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇంకేముంది.. ఇరువురు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. కట్ చేస్తే.. ఆగష్టు 14న తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, మందుల కోసం రూ. 700 పంపమని మంజుల అడిగింది. అతడు వెంటనే డబ్బులు పంపాడు. అనంతరం రూ. 2 వేలు అని ఒకసారి, రూ. 5 అని మరోసారి అడగ్గానే.. పరమేశ్వర్ పంపాడు. ఇలా అడిగినప్పుడల్లా కొద్దికొద్ది అమౌంట్ ఇచ్చుకుంటూ వచ్చాడు.
కొన్ని రోజుల క్రితం తాను ఐఏఎస్ పరీక్ష పాసయ్యానని, ఇక కలెక్టర్ పోస్ట్ వస్తుందని మంజుల మెసేజ్ చేసింది. అయితే.. అందుకోసం తాను బెంగళూరుకి వెళ్లాలని, ఖర్చులకు ఆర్థిక సాయం చేస్తే పెళ్లి చేసుకుంటానని మంజుల తెలిపింది. ఆమె మాటలు నమ్మిన పరమేశ్వర్.. రూ. 50 వేలు పంపాడు. అప్పట్నుంచి మంజుల మరింత స్నేహంగా మెలగింది. అది చూసి, ఆ అమ్మాయి తనని నిజంగానే ప్రేమిస్తుందని పరమేశ్వర్ అనుకున్నాడు. కానీ, మంజుల గాత్రం స్నేహంగా మెలుగుతూ.. దశలవారీగా రూ.41.26 లక్షలు కాజేసింది. తన వద్ద ఖర్చులకు డబ్బు లేదని, కొంత డబ్బు ఇవ్వాలని పరమేశ్వర్ అడగ్గా.. మంజుల రూ. 2.21 లక్షలు తిరిగి ఇచ్చింది.
అయితే.. ఇచ్చిన ఆ డబ్బు తనకు తిరిగి వెనక్కు ఇవ్వాలని మంజుల డిమాండ్ చేసింది. మరి తానిచ్చిన ఇతర డబ్బుల సంగతేంటని పరమేశ్వర్ ప్రశ్నిస్తే.. అదంతా తనకు సంబంధం లేదని, తన రూ. 2.21 లక్షలు తిరిగివ్వాలని మంజుల అడిగింది. దీంతో పరమేశ్వర్‌కి అనుమానం వచ్చి.. ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన మంజుల.. కంటికి కనిపించకుండా వెళ్లిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామని, కచ్ఛితంగా ఆ యువతిని పట్టుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
