Illegal Affair : బంధాలు బలిగోరుతున్నాయా? వివాహేతర సంబంధాలు అయిన వాళ్లను కడతేర్చే వరకు వెళ్తున్నాయా? యస్.. దీనికి అవుననే సమాధానం వస్తోంది. సొంతవాళ్లు.. రక్త సంబంధం అనే తేడా కూడా లేకుండా.. తమ బంధానికి అడ్డొచ్చిన వారిని అడ్డంగా చంపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో వివాహేతర సబంధానికి కన్నకొడుకునే బలి చేసింది కసాయి తల్లి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు.
వివాహేతర బంధాలు కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. మెదక్ జిల్లాలో వివాహేతర బంధం కోసం ఓ మహిళ.. తల్లితనానికే మచ్చ తెచ్చింది. ఈ విషయం 9 నెలల తర్వాత బయటకు వచ్చింది… గతేడాది నవంబర్ 28న మెదక్ జిల్లా తుప్రాన్ మండలంలోని ఆబోతుపల్లి హల్దీవాగులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మెడకు నైలాన్ తాడు, చున్నీతో ఉరివేసి వాగులో పడేయటంతో హత్యగా నిర్థారించారు పోలీసులు. మృతుడి వివరాలు దొరక్కపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదుచేశారు. కానీ ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు. దీంతో తుప్రాన్ పరిసరప్రాంతాల్లో మృతదేహాం ఫోటోలతో పోస్టర్లు అతికించారు. అయినా ఎక్కడ కూడా మృతుడికి సంబంధించి ఆధారాలు లభించలేదు.
Read Also : Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
ఆగస్ట్ 15న ఓ వ్యక్తి ఓ పోస్టర్ చూసి తూఫ్రాన్ పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. మృతుడి పేరు ఆహ్మద్ పాషా అని అతడి వయసు 25 ఏళ్లు ఉంటుదని చెప్పాడు. తుప్రాన్ మండలంలోని వెంకటాయిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించాడు. ఆ సమాచారంతో అహ్మద్ పాషా ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ తల్లి రెహనా ఉంది. అహ్మద్ పాషా ఏమవుతాడని అడిగారు. కొడుకు అని చెప్పింది. కనిపించకుండా పోయి 9 నెలలవుతున్నా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కానీ ఆమె తడబాటుకు గురవడంతో పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి సంచలన విషయం వెలుగు చూసింది…
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండటంతో తానే హత్యచేసినట్టు తల్లి రెహనా ఒప్పుకుంది. దానికి ప్రియుడు బిక్షపతి కూడా సహకరించారని తెలిపింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భర్త జహంగీర్ చనిపోవడంతో భిక్షపతితో వివాహేతర బంధం పెట్టుకుంది రెహనా. ఇది కాస్తా కొడుకు పాషాకు తెలిసి.. వద్దని వారించాడు. దీంతో గొడవలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో అతన్ని కడతేర్చాలని రెహనా, భిక్షపతి స్కెచ్చేశారు. ఇందుకోసం హల్దీవాగు వద్దకు తీసుకు వెళ్లి మద్యం తాగించారు. ఆ తర్వాత గొడవ జరగడంతో అక్కడే తల్లి అతని మెడకు చున్నీ బిగించింది. భిక్షపతి సైతం మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు. అక్కడ వాగులోనే డెడ్ బాడీ పడేసి వెళ్లిపోయారు. మళ్లీ 9 నెలల తర్వాత విషయం బయటపడడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు..
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిందో వగలాడి. పైగా హత్య చేసి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ వారి పాపం పండడంతో పోలీసులకు దొరికిపోయారు..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆగస్టు 6న నల్లి రాజు అనే వ్యక్తి అనుమానాస్పద స్దితిలో మృతి చెందాడు. హరిజన వీధి పరిసర ప్రాంతంలో పడి ఉన్నాడు. అనుమానస్పదంగా పడి ఉండడంతో స్థానికులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. రాజుకు భార్య మౌనికతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మర్డర్ కోణంలో విచారణ కొనసాగించారు. భార్య మౌనిక ప్రవర్తనపై వారికి అనుమానం వచ్చింది. దీంతో సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా తీగ లాగితే డొంక కదిలింది…
నల్లి రాజుకు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సాఫీగా సాగుతున్న సంసారంలో వివాహేతర బంధం కొంప ముంచింది. పాతపట్నానికే చెందిన గుండు ఉదయ్ కుమార్‌తో వివాహేతర బంధం నడిపించింది మౌనిక. ఈ విషయం తెలిసి భర్త రాజు ప్రశ్నించారు. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. రాజును అడ్డు తొలగించుకుంటే ప్రియినితో హ్యాపీగా ఉండొచ్చని భావించి.. మర్డర్ స్కెచ్ ప్లాన్ చేసింది మౌనిక. మరోవైపు భార్యకు విడాకులు ఇచ్చి మౌనికతో ఉండాలని ఉదయ్ కూడా డిసైడ్ అయ్యాడు. దీంతో తమ ప్లాన్ అమలు చేయాలని స్కెచ్చేశారు. రాజుకు ఇంట్లోనే నిద్రమాత్రలు.. భోజనంలో కలిపి ఇచ్చింది మౌనిక. దీంతో అతను గాఢ నిద్రలో ఉండగా.. ప్రియుడు ఉదయ్‌ని పిలిపించింది. అతడు వచ్చి రాజు ఛాతీపై ఎక్కి కూర్చుకుని దిండుతో ఊపిరి ఆడకుండా చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. రాజు మృతిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మరో ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా మొదట వీధిలోని లైట్లు ఆర్పేసింది మౌనిక. ఇక అప్పటకే హరిజన వీధిలో యాక్సిడెంట్ స్పాట్ క్రియేట్ చేశారు. రాజు టూ వీలర్ అక్కడ పడేసి ఉంచారు. పక్కనే ఓ మద్యం బాటిల్, చెప్పులు అన్నీ సెట్ చేశారు. అక్కడ కూడా స్ట్రీట్ లైట్లు బంద్ చేసి శవాన్ని బండి పక్కనే పడేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగి మృతి చెంది ఉంటాడనేలా సీన్ క్రియేట్ చేశారు. వీరికి ఉదయ్ బావ మల్లికార్జున్ కూడా సహకరించాడు.. తెల్లవారి రాజు డెడ్ బాడీ దగ్గర మౌనిక.. ఏమీ తెలియనట్టు డ్రామా షురూ చేసింది. ఏడ్చినట్లు నటించింది. అందరినీ నమ్మించింది. కానీ పోలీసులు సీసీ ఫుటేజీలు, కాల్ డేటా పరిశీలించడంతో మౌనిక అండ్ ఉదయ్ బండారం బయటపడింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు… ఇలాంటి ఘటనలు చూస్తే.. మూడు ముళ్ల బంధమైనా.. కన్నపేగు బంధమైనా.. వివాహేతర బంధం ముందు విలువలేనివే అనే అర్థమవుతోంది. సొంతవాళ్లే ఇలా హత్యలు చేస్తుంటే.. సమాజం ఎటు పోతుందోననే ఆందోళన రేకెత్తుతోంది. కనీసం నేటి తరానికైనా బంధాలు, బంధుత్వాలు..వాటి విలువలు తెలియ చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ సినిమా..!
