ఈమధ్యకాలంలో అచ్చం సినిమా ఫక్కీలో దొంగతనాలు జరుగుతున్నాయి. అవే కాదు స్కూళ్ళలోని స్ట్రాంగ్ రూంలో ఎగ్జామ్ పేపర్స్ మాయం అవుతున్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి మరీ పరీక్షా పత్రాలు దోచేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
జిల్లా పరిషత్ పాఠశాల లో నిన్న రాత్రి పాఠశాల ఆఫీస్ లోపలికి ప్రవేశించారు దొంగలు. అక్కడే వున్నబీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న త్రైమాసిక పరీక్ష పేపర్లను దొంగిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇందులో 9వ తరగతి పదవ తరగతికి చెందిన పరీక్షా పత్రాలను దొంగలించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ స్థానిక పోలీస్ లకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ లు క్లూస్ టీంతో చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. నిన్నటి నుండి పాఠశాల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ ఘాతుకానికి పాల్పడ్డది ఎవరని ఆరా తీస్తున్నారు పోలీసులు. స్కూళ్ళో చదివే వారే ఈ పనిచేసి వుంటారని, ఆధారాలను బట్టి నిందితుల గురించి తెలుస్తుందన్నారు ప్రిన్సిపల్ రాములు.
