మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్‌లో ఏటీఎం నగదుతో ఉడాయించిన డ్రైవర్ సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేబీఎస్ బస్టాండ్‌లో డ్రైవర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.
వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకున్నాడని… అక్కడ ఖరీదైన చరవాణి కొన్నాడని వెల్లడించారు. ఓ బంగారు గొలుసును కొనుగోలు చేసాడు. అనంతరం హైదరాబాద్ లో 8 లక్షల 60 వేలతో కారును కొనుగోలు చేయగా దానిని వారికే తిరిగి ఇచ్చేసి నగదును తీసుకున్నారు పోలీసులు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టి.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి వద్ద రూ. 29.85లక్షల నగదు, ఒక ఫోను, ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
