Doctor Krithika Reddy Murder Mystery: బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే ఉపయోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఉపయోగించి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు తన మకాంను బెంగళూరు నుంచి ఉడుపి జిల్లా మణిపాల్ కు మార్చాడు. ఈ మధ్యాహ్నం పోలీసులు అతన్ని మణిపాల్ లో అరెస్ట్ చేశారు. బెంగళూరులో విచారణ సాగుతోంది. కాగా, మహేంద్ర రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరూ డాక్టర్లే. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో పని చేసేవాళ్లు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్. తల్లిదండ్రులు మారతహళ్లిలో నివసిస్తోన్నారు. ఒకే ఆసుపత్రిలో పని చేస్తోండటం, డాక్టర్లే కావడం వల్ల మహేంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. 2024 మే 26వ తేదీన వారి పెళ్లి జరిగింది. ఏడాది కూడా తిరగక ముందే కృతికా రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఆమె హత్యలో సినిమాటిక్ కోణాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్న పవన్..?
మొదట్లో ఆమెది సహజ మరణంగా భావించారు. దీని తర్వాత మహేంద్ర రెడ్డి మణిపాల్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే క్లినిక్ తెరిచాడు. రేడియాలజిస్ట్ అయిన కృతిక అక్క డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. సమగ్ర విచారణకు ఆమె పట్టుబట్టారు. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. కేసును తిరగరాశారు. మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. కృతిక రెడ్డి మరణించిన వెంటనే తన ప్రియురాలికి మెసేజీ పంపాడు మహేంద్ర రెడ్డి. “నీ కోసమే కట్టుకున్న భార్యను చంపేశాను” అని అందులో ఉంది. డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా తన ప్రియురాలికి ఈ మెసేజీ పంపినట్లు తేలింది. అతని ఫోన్‌ను ఫోరెన్సిక్ లో విశ్లేషించినప్పుడు ఈ వ్యవహారం బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళను కూడా ప్రశ్నించారు. వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్నీ కూడా డాక్టర్ మహేంద్ర రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేల్చాయని, త్వరలోనే ఛార్జిషీట్ నమోదు చేస్తామని అన్నారు. కృతికా రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కొన్ని మత్తు మందులు, ప్రమాదకర ఇంజెక్షన్లు ఇచ్చాడని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. భార్య ఆరోగ్యం బాగా లేదంటూ అతనే తొలుత ఆసుపత్రిలో అడ్మిట్ చేయించినప్పటికీ.. దానికి ప్రధాన కారకుడు భర్తేనని చెప్పారు.
