CYBER FRAUDS DEATH PENALTY: మయన్మార్- థాయ్‌లాండ్ మధ్య ప్రాంతం.. ఇది సైబర్ నేరాలకు అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే సైబర్ కేటుగాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చైనాలోనూ పలువురు పౌరులు సైబర్ నేరగాళ్లకు చిక్కి మోసపోయారు. అందులో 14 మంది చైనా పౌరులు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న చైనా సర్కారు.. మయన్మార్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఒక భారీ నేర ముఠా ఆట కట్టించింది. బిలియన్ డాలర్ల స్కామ్ చేస్తున్న ఆ ముఠాలోని 11 మంది సభ్యులను అరెస్ట్ చేశారు చైనా పోలీసులు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు చైనా పోలీసులు. దీంతో 14 మంది చైనా పౌరుల మరణానికి కారణమైన ఆ 11 మంది ముఠాకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ శిక్షను చైనా అధికారులు అమలు చేశారు.
Read Also: HYD STEROIDS ARREST: కండలు కాదు, బుడగలు.. స్టెరాయిడ్ మాఫియా గుట్టురట్టు..
మయన్మార్ కేంద్రంగా ఈ ముఠా సాగించిన నేర సామ్రాజ్యం సామాన్యమైనది కాదు. 2015 నుంచి మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని కోకాంగ్ ఏరియాలో అనేక ‘స్కామ్ కేంద్రాలను’ ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా అమాయకులను దోచుకున్నారు. టెలికాం మోసాలు, ఆన్‌లైన్ జూదం, హనీ ట్రాప్ ద్వారా వీరు సుమారు 1.4 బిలియన్ డాలర్లు దోచేశారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 12,000 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు కోర్టు విచారణలో తేలింది. ఈ ముఠా కేవలం డబ్బులు దోచుకోవడమే కాకుండా, అత్యంత క్రూరంగా వ్యవహరించేది. డిజిటల్ అరెస్ట్ పేరుతో మనుషులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసేవారు. వీరి ఆగడాల వల్ల 14 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణాలను గమనించిన వెన్‌జౌ కోర్టు, గతేడాది సెప్టెంబర్‌లోనే ముఠా నాయకులతో సహా 11 మందికి మరణశిక్ష విధించింది. నిందితులు పైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ న్యాయస్థానం వారి అభ్యర్థనను తిరస్కరించింది.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్‌తో దాడి చేసి హత్య..
చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు ఈ ఉరిశిక్షలను ఆమోదించిన తర్వాత.. నిందితులకు చట్టప్రకారం ఒక అవకాశం కల్పించారు. శిక్ష అమలు చేయడానికి కొద్దిసేపటి ముందు వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆ తర్వాత గురువారం ఉదయం జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఈ చర్య ద్వారా విదేశాల్లో ఉండి చైనా పౌరులను మోసం చేసే ఎవరినైనా వదిలిపెట్టబోమని చైనా ప్రభుత్వం హెచ్చరించినట్లయింది. చైనాలో అమలు చేసిన ఈ ఉరిశిక్షలు అంతర్జాతీయ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విదేశీ గడ్డపై ఉండి నేరాలు చేసినా, చైనా ప్రభుత్వం వారిని పట్టుకుని మరీ కఠిన శిక్షలు విధిస్తుందని ఈ ఘటన నిరూపించింది. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ స్కామ్‌ల పట్ల చైనా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాలు డిజిటల్ స్కామ్ కేంద్రాలుగా మారిపోయాయి. మనుషులను అక్రమంగా తరలించి వారిని బలవంతంగా ఇలాంటి స్కామ్ సెంటర్లలో ఉంచి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు చేయిస్తున్నారు. ఇలాంటి నెట్‌వర్క్‌లను తుదముట్టించడానికి చైనాతో పాటు అమెరికా వంటి దేశాలు కూడా ఆయా దేశాల ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి.
