మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్‌లోని నవర్‌గావ్‌కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్‌లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మంగళవారం వెళ్లి జాయిన్ చేసేందుకు పేరెంట్స్ ఏర్పాట్లు చేశారు. కానీ అదే రోజు అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తెల్లవారుజామున 4 గంటలకు తల్లి వెళ్లి చూసేసరికి.. అతడు ఉరేసుకుని కనిపించాడు. అనిల్ రూమ్‌లో సూసైడ్ నోట్ లభించిందని, ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేకనే సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ‘‘నాకు ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేదు. డాక్టర్ కంటే ఒక బిజినెస్‌మెన్ ఎక్కువగా సంపాదిస్తాడు. ఐదేండ్లు ఎంబీబీఎస్, ఆ తర్వాత ఎండీ చేయడం నాకు ఇష్టం లేదు” అని నోట్‌లో పేర్కొన్నట్టు చెప్పారు. సూసైడ్ నోట్‌ను బట్టి ఒత్తిడి భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. కాగా, ఇంతకుముందు ఫస్ట్ అటెంప్ట్‌లోనే అనిల్ నీట్ క్వాలిఫై అయ్యాడు. కానీ మంచి ర్యాంక్ కోసం రెండోసారి ప్రయత్నించాడు. ఈసారి ఆలిండియా లెవల్‌లో 1,475 ర్యాంక్ సాధించినప్పటికీ, ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తున్నది.
