Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!

Basara Iiit

Basara Iiit

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్లా సంపత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కారణంగానే సంపత్ ప్రాణాలు తీసుకున్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ స్పష్టం చేశారు. ఈ ఘటనకు బెట్టింగ్ యాప్స్‌తో పాటు తోటి విద్యార్థులకు కూడా ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

సంపత్ ఆత్మహత్యకు ప్రధాన కారణం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడమేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తన తల్లికి బంగారం కొనివ్వాలనే కోరికతో సంపత్ ఓ నకిలీ పెట్టుబడి పథకాన్ని నమ్మాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు అతడిని మభ్యపెట్టారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ జ్యువెలరీ షాపు ఇన్వెస్ట్‌మెంట్ స్కీంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టించారు.

అయితే, సంపత్ డబ్బులు జమ చేసిన వెంటనే ఆ యాప్ మాయమైంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడిగా పెట్టిన డబ్బులు తిరిగి రావనే ఆందోళనతో హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ కేసుపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇది పూర్తిగా సైబర్ నేరానికి సంబంధించిన ఘటనగా గుర్తించామని, నిందితులను పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మి విద్యార్థులు, యువత మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.