Assam Student Jumps Off Hostel Building After Ragging: ర్యాగింగ్ అనేది సరదాగా ఉండాలి. సీనియర్లు, జూనియర్లకు మధ్య బలమైన బంధం ఏర్పడే వారధిలా పని చేయాలి. కానీ.. కొందరు మాత్రం ర్యాగింగ్ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వేధింపులకు గురి చేస్తూ.. మానసికంగానే కాకుండా శారీరకంగానూ కుంగిపోయేలా చేస్తున్నారు. దీంతో వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్నో సంఘటనలు జరగ్గా.. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ని తట్టుకోలేక, ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. రెండో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన అసోంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగింది.
ఆ విద్యార్థి పేరు ఆనంద్ శర్మ. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచే కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఇతడ్ని వేధిస్తూ వస్తున్నారు. రానురాను వారి వేధింపులు మితిమీరడంతో.. వారి బారి నుంచి తప్పించుకోవడం కోసం హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆనంద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. అతడ్ని దగ్గరలోనే ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు.. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఆనంద్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ ఐదుగురు తమ కుమారుడ్ని గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తూ వచ్చారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడి నుంచి డబ్బులతో పాటు మొబైల్ లాక్కొని హింసించేవారని.. మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని ఆమె వాపోయారు. సీనియర్లు తనని రాత్రంతా వేధిస్తున్నారంటూ.. ఆనంద్ తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపింది. వారి ర్యాగింగ్ కారణంగానే తమ కుమారుడి కాలు విరిగిందని, ఛాతిపై గాయం కూడా అయ్యిందని ఆమె బోరుమన్నారు.
ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్ని వదిలిపెట్టబోమన్న హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్న ఆయన.. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులను సూచించారు. కాగా.. ఆనంద్ శర్మని ర్యాగింగ్ చేసిన వారిలో రాహుల్ ఛేత్రి అనే ఒక మాజీ విద్యార్థి ఉన్నాడు. అతనిది నేరపూరిత చరిత్ర అని తెలుసుకున్న పోలీసులు.. అతనిపై దోపిడీకి పాల్పడడం, హత్యాయత్నం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ యూనివర్సిటీలో ఆనంద్‌తో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా ఉన్నారు.
