NTV Telugu Site icon

Tamilnadu: మరో విద్యార్థిని ఆత్మహత్య.. పక్షం రోజుల వ్యవధిలో రెండో ఘటన

Tamilnadu Suicide

Tamilnadu Suicide

Tamilnadu: తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవ‌ల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చిలో విద్యార్థి మృతి ఘ‌ట‌న మ‌ర‌వ‌కముందే ఇది చోటుచేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం ఉదయం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తిరుత్తణికి చెందిన 17 ఏళ్ల బాలిక తిరువళ్లూరు జిల్లా కిలాచేరి గ్రామంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న తన స్నేహితులకు బాలిక ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే, మొదటి గంట గడిచే వరకు ఆమె తిరిగి రాకపోవడంతో, పాఠశాల సిబ్బంది ఆమె హాస్టల్ గదిని తనిఖీ చేయగా, ఆమె పైకప్పుకు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం హాస్టల్ నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. నెల రోజులుగా బాలిక ఇంటికి వెళ్లలేదని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మనోవేదనతో ఉన్నట్లు ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. సీబీసీఐడీ అధికారులు, తిరువళ్లూరు జిల్లా డీఎస్పీ సెల్వకుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల క్యాంపస్‌లోని పాఠశాల సిబ్బంది, హాస్టల్ వార్డెన్‌లను సీబీసీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం హాస్టల్‌లో ఉంటున్న ఇతర విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించి వారి ఇళ్లకు పంపించింది.

మరోవైపు బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుత్తణి వద్ద రోడ్లను దిగ్బంధించి నిరసనకు దిగారు. ఈ ఆత్మహత్య ఘటనపై తమకు అనుమానంగా ఉందని బాలిక తల్లిదండ్రులు అన్నారు. తమ కూతురికి అసలేం జరిగిందో తెలియకుండా ఆమె మృతదేహాన్ని తీసుకోమన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వెల్లడించారు. గత రాత్రి కూడా తమతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెప్పారు. మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి.. అనంతరం ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యా సంస్థలో ఏదైనా మరణం సంభవించినట్లయితే సీబీ-సీఐడీ ద్వారా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.

Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల చిత్రహింసలకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్లకురుచ్చిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందడంతో జిల్లాలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడంతో సేలం పోలీసులు పాఠశాల, ఇతర ప్రాంతాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. హింసను ప్రేరేపించింది ఎవరో తేల్చాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అధ్యాపకుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక అంత్యక్రియలను తమిళనాడులోని కళ్లకురిచ్చి వేప్పూర్‌లో శనివారం నిర్వహించారు.

Show comments