Aftab Poonawala Reveals Shocking Twist About Shraddha Walker: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని శ్రద్ధా కలిసినందుకే తమ మధ్య గొడవ జరిగిందని.. ఆ గొడవే హత్యకు దారి తీసిందని ఆఫ్తాబ్ పూనావాలా పోలీసులకు తెలిపాడు. ‘‘బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధా వాకర్‌కి ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతడ్ని కలిసేందుకు మే 17వ తేదీన గురుగ్రామ్ వెళ్లింది. ఆ రోజంతా అతనితోనే గడిపి.. మరునాడు మధ్యాహ్నం మెహ్రౌలీ మేముంటున్న ఫ్లాట్‌కి తిరిగొచ్చింది. ఆ అంశం మీద మా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడే నేను ఆవేశం కోల్పోయి, ఆమెను హత్య చేశాను’’ అంటూ విచారణలో భాగంగా ఆఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు. అంతేకాదు.. కొంతకాలంగా తమ మధ్య శారీరక సంబంధం కూడా లేదని, కేవలం రూమ్ మేట్స్‌లాగే నివసించామని వెల్లడించాడు.
ఆఫ్తాబ్ చెప్తోంది నిజమా? కాదా? అనే విషయంపై పోలీసులు విచారించారు. శ్రద్ధా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డేటాలను పరిశీలించారు. ఈ వివరాల ప్రకారం.. ఆఫ్తాబ్ చెప్పింది నిజమేనని పోలీసులు నిర్ధారించారు. బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తిని శ్రద్ధా కలుసుకుందని, అతనితోనే రోజంతా గడిపినట్లు కనుగొన్నారు. డేటింగ్ యాప్‌కు లేఖ రాసి, ఆ వ్యక్తి వివరాల్ని సైతం పోలీసులు తెలుసుకున్నారు. అయితే.. ఆ వ్యక్తి వివరాల్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. ఇటీవల ఆఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో అనాలసిస్ టెస్ట్‌లో భాగంగా.. ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ఇదే సమయంలో ఆఫ్తాబ్ మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు. శ్రద్ధాను హత్య చేయడానికి ముందు.. అతడు మే 19వ తేదీన ముంబై వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడట! కానీ, అంతకుముందు రోజే శ్రద్ధాను హత్య చేయడంతో, ఆ ప్లాన్‌ని రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నాడు.
