A Young Girl Named Tajasri Who Cheated By Boyfriend Commits Suicide: ‘నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు లేకుండా బ్రతకలేను.. నిన్నే పెళ్లి చేసుకుంటా’ అని యువకుడు వెంట పడటంతో.. ఆ అమ్మాయి అతడ్ని నమ్మింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అతని కోసం ఇంట్లో వాళ్లను సైతం వదులుకొని వచ్చేసింది. తీరా ప్రేమ పేరుతో ప్రియుడు తనని మోసం చేశాడని గ్రహించిన ఆ అమ్మాయి.. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీని ప్రేమిస్తున్నానంటూ.. నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్‌కుమార్ వెంటపడ్డాడు. తనని పెళ్లి కూడా చేసుకుంటానని హామీ ఇవ్వడంతో.. తేజశ్రీ అతని ప్రేమను అంగీకరించింది. అప్పట్నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తనే సర్వస్వమంటూ ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించింది. ఇటీవల పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తేజశ్రీని రాజ్‌కుమార్ ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఓ ప్రాంతంలో ఇల్లు తీసుకుని, అక్కడే నివాసం పెట్టారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని తేజశ్రీ ఎన్నో కలలు కంటే.. రాజ్‌కుమార్ మాత్రం పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే చాలు.. తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇలా రోజులు గడిచిపోతూ వచ్చాయి.
దీంతో, రాజ్‌కుమార్ చేతిలో తాను మోసపోయానని తేజశ్రీ గ్రహించింది. ఎవరి కోసమైతే ఇంట్లో వాళ్లని కాదని వచ్చిందో, అతడే తనని మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక.. తీవ్ర మనస్థాపంతో పురుగులు మందు తాగి చనిపోయింది. నిజానికి.. ఈ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకుంది కానీ, తనని ఇంట్లో వాళ్లు అంగీకరిస్తారో లేదోనన్న భయంతో పురుగుల మందు సేవించింది. ఆటోలో వెళ్తుండగా.. మార్గమధ్యంలో స్పృహ కోల్పోయింది. గమనించిన ఆటో డ్రైవర్ ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు.. ప్రియుడు మోసం చేశాడని, నాకు దిక్కెవరంటూ సెల్ఫీ వీడియోలో ఆమె చెప్పిన మాటలు కంటతడి పెట్టించేస్తాయి.
