Site icon NTV Telugu

Lover Slits Girl Throat: ప్రేమను అంగీకరించలేదని.. నడిరోడ్డు మీదే చంపేశాడు

Lover Slit Girl Throat

Lover Slit Girl Throat

A Boy Slits Girl Throat For Not Accepting His Love: కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని.. ఓ యువతిని నడిరోడ్డు మీదే గొంతు కోసి చంపేశాడు ప్రేమోన్మాది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుబ్బల వెంకట సూర్యనారాయణ(25) అనే యువకుడు కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నానంటూ దేవిక(22) అనే అమ్మాయి వెంట పడుతున్నాడు. తనకు ఇష్టం లేదని, తన వెంట పడొద్దని ఆ యువతి ఎంత చెప్పినా అతడు వినలేదు. తన ప్రేమను అంగీకరించాల్సిందేనని వేధిస్తూ వచ్చాడు. దీంతో.. దేవిక ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. ప్రేమ పేరుతో సూర్యనారాయణ వేధిస్తున్నాడని తెలిపింది. దేవిక బంధువులు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి, నెల రోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఆ పంచాయితీలో అమ్మాయిని వేధించొద్దని పెద్దలు తీర్పు ఇవ్వడంతో.. సూర్యనారాయణ బంధువులు అతడ్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.

అప్పటినుంచి సూర్యనారాయణ ఆ యువతి మీద పగ పెంచుకున్నాడు. తన ప్రేమని అంగీకరించకపోతే.. హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. తన ద్విచక్రవానంపై కూరాడ గ్రామానికి వెళ్తున్న దేవికను కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య సూర్యనారాయణ అడ్డగించాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ప్రేమించలేదే లేదని దేవిక తేల్చి చెప్పడంతో.. కోపంతో రగిలిపోయిన సూర్యనారాయణ ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. కొన ఊపిరితో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. మరోవైపు, యువకుడ్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆమె ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యనారాయణ తన వెంట యాసిడ్‌ సీసా కూడా తెచ్చుకున్నాడని తెలిసింది.

కాగా.. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే తాము నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. అమ్మాయిలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన వనిత.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Exit mobile version