20 Members Attacked On Cab Driver in Hyderabad For 200: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ. 200 కోసం ఓ క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆ డ్రైవర్ మూడు నెలల నుంచి కోమాలోనే ఉన్నాడు. విచారకరమైన మరో విషయం ఏమిటంటే.. తమపైనే దాడికి పాల్పడ్డారంటూ బాధితుడిపై నిందితులు కేసు పెట్టారు. దీంతో.. పోలీసులు బాధితుల్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమించడం, అతడు కోమాలోకి వెళ్లడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
నారాయణఖేడ్‌కి చెందిన వెంకటేశ్ (27) అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జూలై 31న రాత్రి సమయంలో వివేక్ రెడ్డి (26) అనే యువకుడు బీఎన్ రెడ్డి నుంచి ఉప్పర్‌పల్లి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయగా.. అతడ్ని ఎక్కించుకునేందుకు వెంకటేశ్ వెళ్లాడు. మార్గమధ్యంలో తన కారు యజమాని ఎక్కించుకొని.. వివేక్‌ని ఎక్కించుకున్నాడు వెంకటేశ్. ఉప్పర్‌పల్లిలో వివేక్‌ని డ్రాప్ చేశాడు. అయితే.. డబ్బుల విషయంలో వివేక్, వెంకటేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం రూ. 600 బిల్లు అవ్వగా, వివేక్ రూ. 200 తక్కువ ఇవ్వడంతోనే గొడవ జరిగింది. అప్పుడు వివేక్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. మొత్తం 20 మంది కలిసి.. వెంకటేశ్‌తో పాటు కారు యజమానిపై దాడి చేశారు. క్రికెట్ బ్యాట్స్, వికెట్లతో చితకబాదారు. డబ్బులు వద్దని, తమని వదిలేయమని ప్రాధేయపడినా.. వాళ్లు వదల్లేదు. అనంతరం, తమ మీదే దాడి చేశారని నిందితులు ఫిర్యాదు చేయగా.. బాధితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితులు తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, రాత్రి నుంచి ఉదయం వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. ఈ క్రమంలో వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్.. కోమాలోకి వెళ్లాడు. అప్పుడు పోలీసులు నిందితుడు వివేక్ మీద కేసు నమోదు చేశారు. అతడు కోర్టులో లొంగిపోగా.. పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు.. వెంకటేశ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. అతని చికిత్స కోసం ఇప్పటివరకూ రూ. 50 లక్షలకు పైగా ఖర్చు అయ్యింది. ఆసుపత్రి ఖర్చుల కోసం వెంకటేశ్ తల్లిదండ్రులు పొలం అమ్మేశారు. తమ కొడుకుని ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.