10th Class Students Physically Harassed Their Classmate In Hyderabad: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి, మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్న సంగతి మర్చిపోయి, ఇతర మహిళలపై వికృత చేష్టలకు తెగబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తోటి విద్యార్థులే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై.. ఆ వికృతాన్ని వీడియో తీసి, ఆ అమ్మాయిని బెదిరించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదర్‌నగర్‌లోని తట్టి అన్నారం ఒక పాఠశాల ఉంది. అందులో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. తమ తోటి విద్యార్థినికి మాయమాటలు చెప్పి, ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశారు. తనని వదిలిపెట్టమని ప్రాధేయపడినా.. ఆ కామాంధులు ఆమెని విడిచిపెట్టలేదు. ఒకరి తర్వాత మరొకరు పాశవికంగా వ్యవహరించారు. అనంతరం ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే.. వీడియోని బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. వీడియో బయటపడితే, కుటుంబం పరువు పోతుందన్న భయంతో, బాధితురాలు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ బాధను తనలోనే దిగమింగుకుంది.
దీన్నే ఆ కామాంధులు అలుసుగా తీసుకున్నారు. తమ చెరలో ఆ అమ్మాయి బంధీ అయ్యిందని భావించి, పది రోజుల తర్వాత ఆ యువతిపై వాళ్లు మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈసారి కూడా వీడియో తీశారు. అనంతరం తామేదో ఘనకార్యం చేశాం అన్నట్టుగా.. ఆ వీడియోని తమ తోటి విద్యార్థులకు పంపించారు. అలా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసి కుంగిపోయిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వాళ్లు కేసు నమోదు చేశారు. పోక్సో సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.